Sunday, June 7, 2020

సీఎం స‌మావేశం త‌ర్వాత‌నే రాయాలా ? వ‌ద్దా..?

ప‌ది ప‌రీక్ష‌లు వాయిదా
హైద‌రాబాద్(Hyderabad) : తెలంగాణ రాష్ట్రంలో సోమ‌వారం నుంచి జ‌ర‌గాల్సిన 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం వాయిదా వేసింది. ఈ మేర‌కు శ‌నివారం రాత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జీహెచ్ ఎంసీ ప‌రిధిలో త‌ప్ప మిగిలిన ప్రాంతాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని హైకోర్టు శ‌నివారం  స్పష్టం చేసింది. అలా చేస్తే స‌మ‌స్య‌లు రావొచ్చ‌ని భావించిన ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ ప‌రీక్ష‌లను నిర్వ‌హించాలా?  లేక  అంత‌ర్గ‌త ప‌రీక్ష‌ల్లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల‌కు గ్రేడ్లు ఇవ్వాలా అన్న‌ది ముఖ్య‌మంత్రి వ‌ద్ద ఆదివారం కానీ సోమ‌వారం కానీ జ‌రిగే ఉన్న‌త స్థాయి స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యానికి రానున్నారు. అయితే ప‌రీఓల ర‌ద్దుకే మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి అంత‌ర్గ‌త మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.
హైకోర్టు ఆదేశాలు వెలువ‌డిన అనంత‌రం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ప‌రిస్థితిని వివ‌రించిన‌ట్టు తెలిసింది. అంత‌కుముందు ఆయ‌న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం సంచాల‌కుడు స‌త్య‌నార‌య‌ణ‌రెడ్డితో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం తీర్పును అనుస‌రించి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల విష‌యంలో అనుస‌రించాల్సిన వ్యూహం గురించి ముఖ్య‌మంత్రి వ‌ద్ద స‌మావేశం నిర్వ‌హించి త‌దుప‌రి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. 
వాయిదాల ప‌ర్వం..!
  • 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి నిర్వ‌హిస్తే ఉప‌యోగం లేదు. అంద‌రికీ ప‌రీక్ష‌లు పూర్త‌యితేనే ఇంట‌ర్‌, బాస‌ర ఆర్‌జీయూకేటీ, పాలిటెక్నిక్ త‌దిత‌ర ప్ర‌వేశాల‌కు వీల‌వుతుంది. 
  • జీహెచ్ ఎంసీ ప‌రిధిలోని విద్యార్థుల‌కు ఇప్పుడు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వమంటే..వారికి ఒక్క‌సారే అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌వుతుంది. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో ప‌రీక్ష‌లు రాసే వాళ్లు ప‌రీక్ష ఫెయిల‌యితే స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాసేందుకు వీల‌వుతుంది. ఇలా కొంద‌రికి రెండు సార్లు , మ‌రికొంద‌రికి ఒక‌సారే ప‌రీక్ష రాసే అవ‌కాశం ఇస్తే న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఒక వేళ జీహెచ్ ఎంసీ ప‌రిధిలోని వారికి మ‌రోసారి ప‌రీక్ష నిర్వ‌హించాలంటే బాగా ఆల‌స్య‌మ‌వుతుంది. మ‌ళ్లీ జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం, ఫ‌లితాల విడుద‌ల త‌దిత‌ర వాటి వ‌ల్ల విద్యా సంవ‌త్స‌రం ఆగ‌మాగ‌వుతుంది.  
  • కొంద‌రికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి..మ‌రికొంద‌రికి త‌ర్వాత అంటే విద్యార్థుల్లోనూ మాన‌సిక ఆందోళ‌న‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ప‌రీక్ష‌లు రాయ‌లేని వారు ఒత్తిడికి గుర‌వుతారు. ప‌రీక్ష‌లు రాసిన వారు కెరీర్‌లో ముందుకు వెళ‌తార‌ని, ముందుగా ఇంట‌ర్‌లో ప్ర‌వేశాలు పొందుతార‌ని భావించే అవ‌కాశం ఉంది. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని రాష్ట్రం మొత్తం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

No comments:

Post a Comment