Tuesday, June 9, 2020

ఏడాదిగా అనుకుంటున్నాం..ఈ రోజు క‌లిశాం

  • సినిమా చిత్రీక‌ర‌ణ‌కు అనుమ‌తి
  • సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన సినీ ప్ర‌ముఖ‌ల భేటీ

అమ‌రావ‌తి(Amaravathi): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్ మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు మంగ‌ళ‌వారం క‌లిశారు. తాడేప‌ల్లిలో సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన వారు జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత‌లు సురేశ్‌బాబు, సి.క‌ల్యాణ్‌, దిల్‌రాజు త‌దిత‌రులు సీఎంను క‌లిసిన వారిలో ఉన్నారు. సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి , స‌మ‌స్య‌లు, ప‌రిష్కారంపై ఈ సంద‌ర్భంగా సీఎంతో వారు చర్చించారు. రాష్ట్రంలో ఉచితంగా సినిమా చిత్రీక‌ర‌ణల‌కు అనుమ‌తి ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తొలుత మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి విమానంలో గ‌న్న‌వ‌రం వ‌చ్చిన సినీ ప్ర‌ముఖులు అక్క‌డి నుంచి రోడ్డు మార్గం ద్వారా బీజేపీ నేత గోక‌రాజు గంగ‌రాజు అతిథి గృహానికి వెళ్లారు. అక్క‌డ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత సీఎం క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు. అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవి నేతృత్వంలో 25 మంది సినీ ప్ర‌ముఖుల బృందం సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ, క‌రోనా వ్యాప్తి నేపథ్యంలో 7గురికి మాత్ర‌మే క‌లిసే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పడంతో కొద్ది మందికి మాత్ర‌మే అవ‌కాశం ల‌భించింది. 
తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన సినీ ప్ర‌ముఖుల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వారితో స‌మావేశం అయ్యారు. సినీ రంగంలో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రితో చ‌ర్చించారు. క‌రోనా ప్ర‌భావంతో సినీ ప‌రిశ్ర‌మ సంక్షోభంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడు నెల‌ల పాటు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. సినిమా రంగ పూర్వ వైభ‌వం సాధించాలంటే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వినోద రంగంపై విధించే ప‌న్నుకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరిన‌ట్టు తెలిసింది. విశాఖ‌లో స్టూడియోలు, ల్యాబ్‌లు నిర్మాణానికి అనుకూల ప్ర‌దేశం కావ‌డంతో త‌గిన ప్రోత్సాహ‌కాలు ఇవ్వాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. 
సీఎం జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు : చిరంజీవి
స‌మావేశం అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అయితే ఏపీ సీఎం జ‌గ‌న్ షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం సంతోష‌క‌ర‌మ‌ని తెలిపారు. "టాలీవుడ్ ప్ర‌ముఖులంతా ఏడాది కాలంగా సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌నుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. ఈ రోజు క‌లిశాం. ముందుగా ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు. థియేట‌ర్ల‌లో మినిమం ఫిక్స‌డ్ ఛార్జీలు ఎత్తేయాల‌ని కోరాం. నంది అవార్డుల వేడుక‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్ర‌భుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. 2019-20 కి అవార్డుల వేడుక జ‌రుగుతుంద‌ని భావిస్తున్నాం. టికెట్ల ధ‌ర‌లఫ్లెక్సీ రేట్ల‌పై దృష్టి పెట్టాల‌ని కోరాం. ప‌రిశీలిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. అదే జ‌రిగితే పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. మాకు మేలు జ‌రుగుతుంది. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ  అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటాన‌ని సీఎం చెప్ప‌డం మాకు ఆనందం క‌లిగించింది. విశాఖ ప‌ట్ట‌ణంలో స్టూడియోకు దివంగ‌త మ‌హానేత వైఎస్సార్ భూమి ఇచ్చారు. అక్క‌డ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కృషి చేస్తాం." అని చిరంజీవి మీడియా స‌మావేశంలో చెప్పారు. 

No comments:

Post a Comment