Wednesday, June 10, 2020

పొంచిఉన్న మిడతల దండు ముప్పు.. తెలంగాణ అప్రమత్తం..!

హైదరాబాద్:
మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో తెలంగాణ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరికే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర లోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉంది. వాటి ప్రయాణం దక్షిణం వైపు సాగితే చాలా తక్కువ సమయంలోనే తెలంగాణ లోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. ఈనేపథ్యంలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో అధికారులతో సమీక్షించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. మిడతల దండు దక్షిణంవైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పు ఉంటుందని తేలింది. మరోవైపు ఈ నెల 20 నుంచి జులై 5 వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఆ సమయంలో తెలంగాణలో వర్షాకాలం పంట ప్రారంభమై ఉంటుంది. పంటలు మొలకెత్తి కూడా ఉంటాయి. మిడతల దండు దాడి చేసిందంటే చాలా నష్టం జరుగుతుంది. లేత పంటపై పడి పీల్చిపారేస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ లోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ,ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు,సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్ సునీత, యోగ సాయి యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రెహమాన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిది జిల్లాల్లో అప్రమత్తత..
మహారాష్ట్ర చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున.. ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఎనిమిది జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భద్రాచలం ,చర్ల, వెంకటాపురం ,వాజేడు, పేరూరు, మంగంపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్ ,బోధన్, జుక్కల్ ,బాన్స్వాడ ,నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ,మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్ ,కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా మిడతల దండు రాష్ట్రంలో ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ బృందం మరో రెండు రోజుల్లో ఆదిలాబాద్లో పర్యటించనుంది.

No comments:

Post a Comment