Monday, June 22, 2020

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు: ఆ రోజు ఏం జ‌రిగిందంటే..?

అత‌నో తెలుగు యోధుడు...దేశానికి ర‌క్ష‌ణ‌గా నిలిచి పోరాడి వీర మ‌ర‌ణం పొందిన మ‌హా యోధుడు. అప్ప‌టికే శ‌రీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టూ పెద్ద సంఖ్య‌లో శత్రు బ‌ల‌గాలు మోహ‌రించి ఉన్నారు. త‌న వ‌ద్ద చాలా త‌క్కువ మంది సైనికులే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌నే లేదు. శత్రువుతో ఆమీతూమీ కి సిద్ధ‌ప‌డ్డాడు. అత‌నెవ్వ‌రో కాదు మ‌న తెలుగు బిడ్డ క‌ర్న‌ల్ సంతోష్‌బాబు. చైనా లేవ‌నెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో చివ‌రి వ‌ర‌కూ పోరాడి భ‌ర‌త‌మాత ర‌క్ష‌ణ‌లో అమ‌రుడ‌య్యారు. 

న్యూఢిల్లీ(Newdhile): తూర్పు ల‌ద్దాఖ‌లోని గ‌ల్వాన్ లోయ‌లో ఈ నెల 15న చైనా బ‌ల‌గాల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త సైన్యానికి చెందిన క‌ర్న‌ల్ సంతోష్‌బాబు స‌హా 20 మంది సైనికులు వీర మ‌ర‌ణం పొందిన సంగ‌తి తెలిసిందే. నాటి ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు అధికార వ‌ర్గాల ద్వారా తాజాగా వెలుగులోకి వ‌చ్చాయి. సంతోష్ నేతృత్వంలోని మ‌న బ‌ల‌గాలు సాగించిన వీరోచిత పోరాట‌మ‌ని చెప్పుకోవ‌చ్చు. గ‌ల్వాన్ ప్రాంతంలో"‌16బిహార్" రెజిమెంట్ విధులు నిర్వర్తిస్తోంది. ఈ దళానికి క‌ర్న‌ల్ సంతోష్‌బాబు క‌మాండింగ్ అధికారి(సీఓ)గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఉద్రిక్త ప‌రిస్థితుల వ‌ల్ల రెండు దేశాలూ పోటాపోటీగా  అక్క‌డికి బ‌ల‌గాల‌ను త‌ర‌లించాయి. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని చ‌ల్లార్చేందుకు ఈ నెల 6న రెండు దేశాల లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ స్థాయి సైనికాధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి.
అందులో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం..రెండు దేశాలు త‌మ స‌రిహ‌ద్దుల నుంచి అద‌న‌పు బ‌ల‌గాల‌ను వెన‌క్కి త‌ర‌లించాలి. ఇందులో భాగంగానే గాల్వాన్ లోయ‌లోని పెట్రోలింగ పాయింట్ -14 నుంచి చైనా సైని ఉప‌సంహ‌ర‌ణ జ‌ర‌గాలి. దీన్ని ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌ను భార‌త సైనిక నాయ‌క‌త్వం..క‌ర్న‌ల్ సంతోష్ నేతృత్వంలోని 16 బిహార్ ద‌ళానికి అప్ప‌గించింది. ‌

క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన చైనా..

చైనా సైనికులు తొలుత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. త‌మ శిబిరాల‌నూ తొల‌గించారు. ఈ అంశంపై స్థానిక చైనా క‌మాండ‌ర్‌తో క‌ర్న‌ల్ సంతోష్ బాబు చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. అయితే అక స్మాత్తుగా ఈ నెల 14న చైనా సైన్యం అక్క‌డ స‌రిహ‌ద్దు ప‌రిశీల‌న కేంద్రాన్ని, మ‌రికొన్ని గుడారాల‌ను ఏర్పాటు చేసింది. ఒప్పందం మేర‌కు దీన్ని తొల‌గించాల‌న్న సందేశంతో చిన్న గ‌స్తీ బృందాన్ని "16 బీహార్" ద‌ళం పంపింది. డ్రాగ‌న్ ద‌ళాలు దీనికి స‌సేమిరా అన్నాయి. మ‌న గ‌స్తీ బృందం ఈ విష‌యాన్ని సంతోష్ బాబుకు తెలియ‌జేసింది. భార‌త్ బృందం వ‌చ్చి వెళ్లాక చైనా సైనికులు అక్క‌డికి భారీగా అద‌న‌పు బ‌ల‌గాల‌ను ర‌ప్పించారు.

రంగంలోకి దిగిన సంతోష్‌బాబు..

చైనా శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు సంతోష్‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆయ‌న నేతృత్వంలోని బృందం ఈ నెల 15న చైనా శిబిరం వ‌ద్ద‌కు వెళ్లింది. అక్క‌డ స్థానిక చైనా బ‌ల‌గాలు కాకుండా కొత్త ముఖాలు ఉన్న‌ట్టు ఆయ‌న గుర్తించారు. పాత‌వారు సంతోష్‌కు తెలుసు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను చైనా పంపిన‌ట్టు ఆయ‌న గుర్తించారు. అబ్జ‌ర్వేష‌న్ పోస్ట్‌, ఇత‌ర గుడారాల‌ను అక్క‌డ ఏర్పాటు చేయ‌డం అక్ర‌మ‌మ‌ని పొరుగుదేశ‌పు  క‌మాండ‌ర్ కు సంతోష్ సృష్టం చేశారు. అయితే చైనా సైనికుడొక‌రు ఆయ‌న‌ను బ‌లంగా వెన‌క్కి తోసేశారు.

క‌ట్ట‌లు తెంచుకున్న ఆగ్ర‌హం..

త‌మ సీవో సార్‌పై జులుం ప్ర‌ద‌ర్శించడంతో భార‌త్ సైనికుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. చైనా సైనికుల‌పై పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ పోరు దాదాపు అర గంట‌పాటు సాగింది. ఇరుప‌క్షాల‌కు చెందిన అనేక మంది గాయ‌ప‌డ్డారు. అంతిమంగా మ‌న బ‌ల‌గాల‌దే పైచేయి అయింది. భార‌త సైనికులు, చైనా గుడారాల‌ను నేల‌కూల్చ‌డ‌మే కాకుండా, వాటిని కాల్చి బూడిద చేశారు. గ‌త్యంత‌రం లేక డ్రాగ‌న్ ద‌ళాలు వెనుదిరిగాయి. 
ఈ పోరులో క‌ర్న‌ల్ సంతోష్ బాబు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అయినా వెన‌క్కి వెళ్లేందుకు ఆయ‌న నిరాక‌రించారు. ఘ‌ట‌నా స్థలంలోనే ఉండిపోయారు. త‌న బ‌ల‌గాన్ని ముందుండి న‌డిపించారు. గాయ‌ప‌డిన భార‌త సైనికుల‌ను వెన‌క్కి పంపారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను ర‌ప్పించారు. ఘ‌ర్ష‌ణ  కార‌ణంగా అక్క‌డ తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. కొద్దిసేప‌టి త‌ర్వాత చైనా సైనికులు పెద్ద సంఖ్య‌లో అద‌న‌పు బ‌ల‌గాల‌తో అక్క‌డికి చేరుకున్నారు. పొడ‌వైన మేకులు క‌లిగిన ఇనుప‌క‌డ్డీల‌తో మ‌న బ‌ల‌గాల‌పై దాడి చేశారు. భార‌త్ సైనికులు బాయ్‌నెట్‌ల‌తో ఎదుర్కొన్నారు. త‌మ క‌న్నా చైనా సైనికులు పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ప్ప‌టికీ క‌ర్న‌ల్ సంతోష్‌బాబు నాయ‌క‌త్వంలో భార‌త బ‌ల‌గాలు భీక‌ర పోరాటం చేశాయి. 

పెద్ద పెద్ద రాళ్లతో దాడి..

అప్ప‌టికే అక్క‌డ బాగా చీక‌టి ప‌డింది. గ‌ల్వాన్ న‌ది ఒడ్డున‌, ప‌ర్వ‌త పంక్తిపైన మాటు వేసిన చైనా బ‌ల‌గాలు అక్క‌డికి వ‌చ్చాయి. వ‌స్తూనే భార‌త సైనికుల‌పై పెద్ద రాళ్ల‌తో దాడి చేయ‌డం ప్రారంభించాయి. సంతోష్ త‌ల‌పై ఒక పెద్ద రాయి పండింది. దీంతోఆయ‌న గ‌ల్వాన్ న‌దిలోకి ఒరిగిపోయారు. త‌మ కమాండింగ్ అధికారి నేల‌కొర‌గ‌డంతో భార‌త్ సైనికులు ఊగిపోయారు. చైనా సైనికులు 350 మందికి, తాము 100 మందే ఉన్న‌ప్ప‌టికీ లెక్క‌చేయ‌క వారిపై విరుచుకుప‌డ్డారు. ఇరు దేశాల‌కు చెందిన అనేక మంది చ‌నిపోయారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లు ఎల్ఏసీ వెంబ‌డి మిగ‌తా ప్రాంతాల‌కు పాకాయి. 
గ‌ల్వాన్ లోయ‌లో దాదాపు 3 గంట‌ల‌పాటు పోరాటం సాగింది. పోరు ఆగేస‌రికి భారత్‌, చైనాల‌కు చెందిన అనేక మంది సైనికుల మృత‌దేహాలు న‌దిలో ఉన్నాయి. సంతోష్ స‌హా ప‌లువురు భార‌త జ‌వాన్ల మృత‌దేహాల‌ను మ‌న సైన్యం వెన‌క్కి తీసుకొచ్చింది. మిగ‌తా బృందం మాత్రం ఘ‌ట‌నా స్థలంలో ఉండి ప‌రిస్థితిని స‌మీక్షించింది. మ‌రుస‌టి రోజు ఉద‌యానికి ఉద్రిక్త‌త‌లు కొద్దిగా త‌గ్గాయి. చైనా సైనికుల మృత‌దేహాలు ఇంకా అక్క‌డే ప‌డి ఉన్నాయి. వీటిని మ‌న సైనికులు పొరుగుదేశానికి అప్ప‌గించారు. సంఖ్య త‌క్క‌వుగా ఉన్న‌ప్ప‌టికీ పీపీ14 వ‌ద్ద చైనా శిబిరాన్ని తొల‌గించేంత వ‌ర‌కు పోరాడి సంతోష్ బృందం వీర‌మ‌ర‌ణం పొందింది. 

No comments:

Post a Comment