Saturday, June 20, 2020

వ‌ల‌స‌కార్మికులూ మ‌నుషులే..:హైకోర్టు

హైద‌రాబాద్(Hyderabad):
వ‌ల‌స కార్మికుల క‌ష్టాల‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వ‌లస కార్మికులూ మ‌న‌లాంటి మ‌నుషులే. వాళ్ల ఆర్థిక దుస్థితి లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన క‌ష్టాల‌తో రోడ్డున ప‌డ్డారు. మాన‌వ‌త్వంతో వాళ్ల‌ను ఆదుకోవాలే త‌ప్ప హీనంగా చూడొద్దు. పురుగులు, జంతువుల్లా తీసిపారేయొద్దు. కాళ్లు పూర్తిగా చాపుకుని ప‌డుకునేందుకు కూడా వీలులేని చిన్న‌చిన్న గ‌దుల్లో వాళ్లు బ‌తుకుతున్నారు. అలాంటి గ‌దిలో ఒక రోజు ఉంటే వాళ్ల క‌ష్టాలు తెలుస్తాయి..అంటూ అధికారుల‌పై హైకోర్టు తీవ్రంగా మండిప‌డింది. వ‌ల‌స కార్మికుల ప‌ట్ల అధికారుల నిర్ల‌క్ష్యం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇటుక బ‌ట్టీల్లో ప‌నిచేసే కార్మికుల‌ను వారి సొంత రాష్ట్రాల‌కు త‌ర‌లించే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. బీహార్‌, ఛ‌త్తీష్‌ఘ‌డ్‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో మాట్లాడిరైళ్ల‌లో పంపించాల‌ని ఉత్త‌ర్వ‌లు జారీ చేసింది. క‌రోనా టైంలో వ‌ల‌స కార్మికుల్ని వ‌దిలేయ‌కుండా బాధ్య‌త గుర్తెరిగి వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు చెప్పింది. 

శ్రామిక్ రైళ్ల‌ను న‌డ‌పాల్సిందే..!

సాధార‌ణ రైలులో బోగీల‌ను ఏర్పాటు చేయ‌లేక‌పోతే ప్ర‌త్యేకంగా శ్రామిక్ రైళ్ల‌ను న‌డ‌పాల్సిందేన‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎగ్జిబిష‌న్ స‌మ‌యంలో ఏర్పాటు చేసే తాత్కాలిక టాయిలెట్స్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. వ‌ల‌స కార్మికులు ఇక్క‌డ ఉన్నంత కాలం వారి ర‌క్ష‌ణ బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని చెప్పింది. పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్ధులు, గ‌ర్భిణీల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలంది. పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వ‌సుధా నాగ‌రాజ్ వాదిస్తూ, శ్రామిక్ రైలు న‌డ‌పాలంటే రూ.10 ల‌క్ష‌లు అవుతుంద‌ని, రైల్వే శాఖ సాధార‌ణ రైలుకు నాలుగు బోగీల‌ను వ‌ల‌స కార్మికుల‌కు కేటాయించ‌డం లేద‌ని చెప్పారు. మ‌రో లాయిర్ వాదిస్తూ 120 మంది ఉండే స్కూల్‌లో 350 మంది కార్మికుల‌ను ఉంచార‌ని, మౌలిక స‌దుపాయాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని ఆరోపించారు. అక్టోబ‌ర్ 20 వ‌ర‌కూ రిజ‌ర్వేష‌న్లు అయ్యాయ‌ని, వాటిని ర‌ద్దుచేసి వ‌ల‌స‌స కార్మికుల‌కు ఇవ్వ‌డం సాధ్యం కాద‌న్నారు. వాద‌న‌ల అనంత‌రం హైకోర్టు ..కార్మిక‌, సాంఘిక సంక్షేమ‌, రైల్వే శాఖ‌ల అధికారులు వ‌ల‌స కార్మికుల‌కు క‌ల్పించిన వ‌స‌తుల‌ను ప‌రిశీలించి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది. విచార‌ణ‌కు ఈ నెల 22కి వాయిదా వేసింది. 

ఆదాయ‌మే ల‌క్ష్యంగా ఉండ‌రాదు..?

రైల్వే శాఖ ఆదాయ‌మే ల‌క్ష్యంగా ఉండ‌కూద‌ని, సాధార‌ణ రైళ్ల‌లో వ‌ల‌స కార్మికుల‌కు 4 బోగీల‌ను కేటాయిస్తే ఈ స‌మ‌స్య చాలా వ‌ర‌కూ ప‌రిష్కార‌మ‌య్యేద‌ని పేర్కొంది. ఇటుక బ‌ట్టీల్లో ప‌నిచేసే వ‌ల‌స కార్మికుల‌ను వారి రాష్ట్రాల‌కు త‌ర‌లించేలా ఉత్త‌ర్వులు ఇవ్వాలంటూ ఫ్రొఫెస‌ర్ రామ‌శంక‌ర్ నారాయ‌ణ మేల్కొటి, లాయ‌ర్ పీవీ కృష్ణ‌య్య‌, మాన‌వ‌హ‌క్కుల వేదిక ప్ర‌తినిధి జీవ‌న్ కుమార్ దాఖ‌లు చేసిన పిల్స్‌ను శుక్ర‌వారం హైకోర్టు మ‌రోసారి విచారించింది. రైళ్ల ద్వారా వ‌ల‌స కార్మికుల్ని పంపే వ‌ర‌కూ వారికి తిండి, వ‌స‌తి, నీరు, వైద్యం వంటివి ప్ర‌భుత్వ‌మే క‌ల్పించాల‌ని చీఫ్ జ‌స్టిస్ ఆర్ఎస్ చౌహాన్‌, జ‌స్టిస్ విజ‌య‌సేన్‌రెడ్డిల డివిజ‌న్ బెంచ్ మ‌రోసారి ఆదేశాలు జారీ చేసింది. వ‌ల‌స కార్మికుల‌ను వారి రాష్ట్రాల‌కు పంప‌క‌పోతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల్ని ఉల్లంఘించిన‌ట్టే అవుతుంద‌ని హెచ్చ‌రించింది. 

No comments:

Post a Comment