Thursday, June 25, 2020

సంచ‌ల‌న‌మైన "తండ్రి-కొడుకు"ల మ‌ర‌ణం..!

 స‌బ్ జైల్లో జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డిలో ఉన్న తండ్రి , కొడుకుల మ‌ర‌ణం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి చ‌ర్చ‌నీయాంశమైంది. మ‌దురై ధ‌ర్మాస‌నం సుమోటోగా కేసు న‌మోదు చేసింది. మ‌ద్రాసు హైకోర్టులోనూ పిటిష‌న్ దాఖ‌లైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక  న‌గ‌రాల్లో బుధ‌వారం వ‌ర్త‌కులు నిర‌స‌న‌ల‌కు దిగారు. దుకాణాల‌న్నీ మూసివేశారు. సెల్ స‌ర్వీసు సెంట‌ర్లు మూత‌ప‌డ్డాయి. బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు న‌ష్ట ప‌రిహారం ప్ర‌కటించాల‌ని వ‌ర్త‌క లోకం డిమాండ్ చేసింది. త‌న తండ్రి, సోద‌రుడిని హ‌త‌మార్చిన పోలీసుల‌పై హ‌త్య‌కేసు న‌మోదు చేసి క‌ఠినంగా శిక్షించే వ‌ర‌కు మృత‌దేహాల‌ను తీసుకునే ప్ర‌సక్తే లేద‌ని జ‌య‌రాజ్ కుమార్తెలు స్ప‌ష్టం చేశారు. 

చెన్నై: తూత్తుకుడి జిల్లా కోవిల్ ప‌ట్టి స‌మీపంలోని సాత్తాన్ కులంకు చెందిన జ‌యరాజ్‌(63), కుమారుడు ఫినిక్స్‌(31) జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు మ‌ర‌ణించ‌డం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. లాక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌న్న చిన్న కార‌ణంతో పోలీసులు దాష్టీకాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం వివాదానికి దారి తీసింది. ఖాకీల దాష్టీకాన్ని నిర‌సిస్తూ బుధ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్త‌కులు నిర‌స‌న‌ల‌కు దిగారు. వ‌ణిగ‌ర్ సంఘం పేర‌వై నేతృత్వంలో ని అన్ని దుకాణాలు తూత్తుకుడి, తిరున‌ల్వేలి, మైలాడుతురై, మ‌ధురై, క‌డ‌లూరు, తిరుచెందూరుల్లో నిర‌స‌న‌ల్ని హోరెత్తించాయి.య‌జ‌మానులు న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి త‌మ దుకాణాల ఎదుట నిర‌స‌న చేప‌ట్టారు.   ఇవి చ‌ద‌వండి: ఉమ్మ‌డి  ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా అల‌జ‌డి..!

సుమోటోగా కేసును స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం..

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్ద‌రు స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్లు, ఇద్ద‌రు పోలీసుల‌ను సస్పెండ్ చేయ‌గా, మ‌రో 15 మందిని బ‌దిలీ చేశారు.ఈ ప‌రిణామాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న మ‌ద్రాసు హైకోర్టు మ‌ధురై ధ‌ర్మాస‌నం కేసును సుమోటోగా స్వీక‌రించింది. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగానే కోర్టు ప‌రిగ‌ణిస్తోంది. లాక‌ప్ డెత్‌ల‌కు ముగింపు లేదా..? అని న్యాయ‌మూర్తులు ప్ర‌కాష్‌, పుగ‌లేంది నేతృత్వంలో బెంచ్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. గంటల వ్య‌వ‌ధిలోనే డీజీపీ, తూత్తుకుడి ఎస్పీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించారు. అయితే సీఎం ప‌ళ‌నిస్వామితో క‌రోనా  నివార‌ణ చ‌ర్య‌ల‌పై డీజీపీ కాన్ఫ‌రెన్స్ లో ఉండ‌టంతో కుద‌ర‌లేదు. దీంతో ఆయ‌న త‌ర‌పున డీఐజీ విచార‌ణ‌కు హాజ‌రు అయ్యారు. తాము చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను కోర్టు ముందు ఉంచారు. విధి విధానాల‌ను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తూ పిటిష‌న్ 26వ తేదీకి వాయిదా వేశారు. అలాగే మృత‌దేహాల‌కు పోస్టుమార్టం పూర్తిగా వీడియో చిత్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని, విచార‌ణ‌ను కోర్టు ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని ఆదేశించారు. 

వివాదంలో ఇరుక్కున్న మేజిస్ట్రేట్‌...

ఆ ఇద్ద‌రిని రిమాండ్‌కు త‌ర‌లించిన కోవిల్ప‌ట్టి మేజిస్ట్రేట్ ఈ వివాదంలో ఇరుకున్న‌ట్టుగా ప‌రిస్థితి మారింది. చెన్నైకు చెందిన న్యాయ‌వాది సూర్య‌ప్ర‌కాశం మ‌ద్రాసు హైకోర్టు న్యాయ‌మూర్తులు సుంద‌రేష్‌, కృష్ణ‌కుమార్ బెంచ్ ముందు హాజ‌ర‌య్యారు. తండ్రి కుమారుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించే ముందు ఎందుకు వైద్య ప‌రీక్ష‌ల‌కు న్యాయ‌మూర్తి ఆదేశించలేద‌ని ప్ర‌శ్నించారు. దీంతో పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని, విచారిస్తామ‌ని న్యాయ‌మూర్తులు సూచించారు. కోవిల్ ప‌ట్టి మేజిస్ట్రేట్ భాగ‌స్వామ్యంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ మ‌ద్రాసు హైకోర్టు లో పిటిష‌న్ దాఖ‌లైంది. గురువారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. 
ఇద్ద‌రి మృత‌దేహాల‌ను తిరునల్వేలి జిల్లా పాళ‌యం కోటై ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ మ‌ధ్యాహ్నం పోస్టుమార్టం జ‌రిగింది.  అయితే మృత‌దేహాల‌ను తీసుకునేందుకు కుంటుంబీకులు నిరాక‌రించారు. జ‌య‌రాజ్ స‌తీమ‌ణి సెల్వ‌రాణి, ముగ్గురు కుమార్తెలు క‌న్నీటి ప‌ర్యంతంతో మీడియా ముందుకు వ‌చ్చారు. పోలీసుల‌పై హ‌త్య కేసు న‌మోదు చేసే వ‌ర‌కు మృత‌దేహాల‌ను తీసుకునే ప్ర‌సక్తే లేద‌ని తేల్చారు. మ‌రో వైపు తూత్తుకుడి ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగుతుంటే సీఎం ప‌ళ‌ని స్వామి మౌనంగా ఉండ‌టం శోచ‌నీయ‌మ‌ని ఎంపీ క‌నిమొళి ట్విట‌ర్ లో విమ‌ర్శించారు. హ‌త్య కేసు న‌మోదు చేయాల‌ని ఆమె డీజీపీ జేకే త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. 
సిఏం స్పందిస్తూ..
ఈ ఘ‌ట‌నపై సీఎం ప‌ళ‌నిస్వామి బుధ‌వారం స్పందించారు. చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. తండ్రి కుమారుల మ‌ర‌ణానికి సంతాపం తెలిపారు. కుటుంబంలో ఒక‌రికి  ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని, రూ.20 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం ప్ర‌క‌టించారు. సీఏం ఆదేశించ‌డంతో జ‌య‌రాజ్‌, ఫినిక్స్ కుటుంబానికి మృత‌దేహాల‌ను అప్ప‌గించేందుకు తూత్తుకుడి, తిరున‌ల్వేలి జిల్లా అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

No comments:

Post a Comment