Sunday, June 14, 2020

ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్ద‌న్న హీరోనే.. చివ‌రికి ఇలా..!

ముంబాయి(Mumbai):
ఇండియ‌న్ క్రికెట‌ర్ ధోనీ జీవిత‌చ‌రిత్ర‌లో టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.  బాంద్రాలో ఉన్న త‌న ఇంట్లో ఆయ‌న ఉరివేసు కున్న‌ట్టు ముంబాయి పోలీసులు ధృవీక‌రించారు.ఆత్మ‌హ‌త్య‌కు  గ‌ల కార‌ణాలు తెలియ‌లేద‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ వంటిదేమీ దొర‌క‌లేద‌ని ముంబాయి పోలీసుల అధికార ప్ర‌తినిధి డీసీపీ ప్ర‌ణ‌య్ అశోక్ చెప్పారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు ఆయ‌న ఇంట్లో ప‌నిచేసేవారు స‌మాచారం అందించ‌డంతో  పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. 
ఆత్మ‌హ‌త్య‌లు వ‌ద్ద‌ని చెప్పిన హీరోనే చివ‌ర‌కు...
సుశాంత్ కేవ‌లం హీరోగానే కాదు. టీవీ ఆర్టిస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా , దాత‌గానూ పేరు తెచ్చ‌కున్నారు. చ‌దువ‌కునే రోజుల్లో జీనియ‌స్ అని పేరు తెచ్చ‌కున్న ఆయ‌న జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజ‌క్స్‌లో విజేత‌గా నిలిచారు. గ‌తంలో తాను న‌టించిన చిచ్చోరే సినిమాలో ఆత్మ‌హ‌త్య స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాద‌ని సందేశం ఇచ్చే హీరో పాత్ర పోషించిన సుశాంత్ ఇప్పుడు తానే ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ‌టం ప‌లువురిని క‌లిచివేసింది. 
టీవీ నటుడిగా మొద‌లై...
సుశాంత్ సింగ్ బిహార్‌లోని ప‌ట్నాలో 1986లో జ‌న‌వ‌రి 21న జ‌న్మించారు. సినిమాల్లోకి రాక‌ముందు ఎన్నో టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టించారు. కిస్‌దేశ్ మేహై మేరా దిల్ అనే టీవీ సీరియ‌ల్ తో అత‌ని న‌ట‌నా జీవితం ప్రారంభ‌మైంది. జీటీవీలో 2009-11 లో వ‌చ్చిన ప‌విత్ర రిష్తా సీరియ‌ల్‌తో మంచి పేరు సంపాదించిన ఆయ‌న 2013లో వ‌చ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 
మొద‌టి సినిమాకే అవార్డు...
2013లో వ‌చ్చిన కైపోచే తో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.  అందులో త‌న న‌ట‌న‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. త‌ర్వాత సుశాంత్ శుద్ధ దేశీ రోమాన్స్‌, డిటెక్టివ్ బ్యోమ‌కేష్ బ‌క్షీ లాంటి సినిమాలు చేశారు. అమీర్ ఖాన్ సూప‌ర్ హిట్ మూవీ పీనే..లోనూ సుశాంత్‌ది కీల‌క పాత్ర ఉంది. 
ధోనీ సినిమాతో సౌత్‌లోనూ ఎంట్రీ..!
భార‌త క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ జీవిత క‌థ తో వ‌చ్చిన ధోనీః ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో ద‌క్షిణాది ప్రేక్ష‌ల‌కు కూడా ప‌రిచ‌య‌మ‌య్యారు. కేదార్‌నాధ్‌, చిచోరే లాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా చేశారు. 
టీవీ న‌టుడిగా కెరియ‌ర్ ప్రారంభించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవ‌ల కొన్నేళ్లుగా వెండితెర‌పై త‌న‌దైన గుర్తింపు తెచ్చ‌కున్నాడు. సుశాంత్ న‌టించిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చందామామా దూర్ కే రిలీజ్ కావాల్సి ఉంది. బ‌డ్జెట్ కొర‌త‌తో ఈ చిత్రాన్ని ప్ర‌స్తుతానికి ఆపేశారు. ప‌ది రోజుల క్రితం అత‌డు ఇన్‌స్టాగ్రాంలో త‌న త‌ల్లి ఫొటోతో పాటు త‌న ఫొటోను పోస్టు చేశాడు. 
"మ‌స‌క‌బారిన గ‌తం క‌న్నీరుగా జారి ఆవిర‌వుతోంది. అనంత‌మైన క‌ల‌లు చిరున‌వ్వును, అశాశ్వ‌త‌మైన  జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెంటింటి మ‌ధ్యా బతుకుతున్నా.. "అని సుశాంత్ ఆ పోస్టులో రాశారు. 
ప్రేమ జీవితంలో ఇబ్బందులు...
సుశాంత్ ఇంజ‌నీరింగ్ చేశాక హీరో కావాల‌నే క‌ల‌లు నిజం చేసుకోవ‌డానికి యాక్టింగ్ వైపు మ‌ళ్లారు. మొద‌ట్లో అత‌డు డ్యాన్స‌ర్‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత "కిస్ దేశ్ మే హై మేరా దిల్" పేరుతో వ‌చ్చిన సీరియ‌ల్ తో అత‌డికి యాక్టింగ్ కెరీర్లో మొద‌టి బ్రేక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత "ప‌విత్ర రిస్తా" సీరియ‌ల్ సుశాంత్‌ను ఇంటింటికీ ప‌రిచ‌యం చేసింది. యాక్టింగ్ కెరీర్ విజ‌య‌వంతం అయ్యాక సుశాంత్ జ‌ర న‌చ్‌కే దిఖా , ఝ‌ల‌క్ దిఖ‌లాజా , డాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు. ఆ త‌ర్వాత సుశాంత్ సినిమాల్లోకి వ‌చ్చాడు. తొలి సినిమా కైపోచే లో అత‌డికి ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో సుశాంత్ కెరియ‌ర్ గ్రాఫ్ పెరిగింది. వ‌రుస హిట్లు అందుకున్నాడు. కెరియ‌ర్ ప‌రంగా విజ‌యం ద‌క్కినా సుశాంత్ ల‌వ్ లైఫ్ అంత సంతృప్తిక‌రంగా లేదు. టీవిసీరియ‌ల్ "ప‌విత్ర రిష్తా" లో స‌హాన‌టి అంకితా లోఖండేతో అత‌డు స‌హ‌జీవ‌నం చేశాడు. త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి. సుశాంత్ సినీరంగంలో విజ‌య‌వంతం కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని భావించారు. ఇటీవ‌ల సుశాంత్ ద‌గ్గ‌ర గ‌తంలో మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన చుంకీ దిశా సలియ‌న్ కూడా ఒక భ‌వ‌నం  మీద నుంచి ప‌డిపోవ‌డం వ‌ల్ల చ‌నిపోయారు.మొద‌ట ఆమెది ఆత్మ‌హ‌త్య అనుకున్నారు. కానీ మ‌ద్యం మ‌త్తులో పైనుంచి ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. 

No comments:

Post a Comment