Friday, June 5, 2020

బెజవాడ గ్యాంగ్ వార్:13 మంది అరెస్టు

వివరాలు వెల్లడించిన సిపి ద్వారకా తిరుమల రావు
విజయవాడ: తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో విచారణ పూర్తయింది. గ్యాంగ్ లీడర్ పండు తో సహా 13 మంది వీధి రౌడీలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని వివరించారు.
పండు గ్యాంగ్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ సందీప్ చనిపోయాడు. గతంలో సందీప్, పండు మంచి స్నేహితులు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. యనమలకుదురు స్థల వివాదంలో పండు, సందీప్ ల మధ్య గొడవ జరిగింది. ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి మధ్య అపార్ట్మెంట్ నిర్మాణం లో వివాదం తలెత్తింది. శ్రీధర్ రెడ్డి నుండి రావాల్సిన వాటా కోసం ప్రదీప్ రెడ్డి నాగబాబు ను ఆశ్రయించాడు. వివాదం పరిష్కారం కోసం గత నెల 29న సందీప్, పండును పిలిపించారు. నాగబాబు, సందీప్ లు ఉండగా పండు రావడం ఇరువురికి నచ్చలేదు.
దీంతో పండు కు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించుకొని సందీప్ ఫోన్లో బెదిరించే యత్నం చేశాడు. సెటిల్మెంట్ నువ్వు ఎందుకు వచ్చావు ?అని నిలదీశాడు. 29న అర్థరాత్రి  పండు ఇంటికెళ్లి సందీప్ బెదిరించాడు. ఆ తర్వాత 30వ తేదీన ఉదయం పండు అనుచరులు సందీప్ ఇంటికి వెళ్లారు. సందీప్ షాప్ లో ఉన్న అనుచరుడ్ని పండు గ్యాంగ్ కొట్టింది. మాట్లాడుకుందామని పిలుచుకొని 31 వ తేదీన సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు వెళ్లేసరికి చాలామంది  గాయపడి ఉన్నారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించాము. గ్యాంగ్ వార్ లో వాడిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం." అని సిపీ వివరాలు వెల్లడించారు.

No comments:

Post a Comment