Tuesday, May 19, 2020

ఈ స‌మ‌యంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతారా..?

దీక్ష‌ల‌కు సిద్ధం కండి: నారా చంద్ర‌బాబునాయుడు
హైద‌రాబాద్: ప్ర‌జ‌లు క‌రోనా క‌ష్టాల్లో అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచ‌డం దారుణ‌మ‌ని టిడిపి అధినేత , ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. దేశంలో డిస్క‌మ్‌ల‌కు కేంద్రం రూ.90 వేల కోట్ల రాయితీలు ఇస్తే..జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలు పెంచ‌డం దుర్మార్గ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై  ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లుకు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. 
అన్ని మండ‌లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపి నాయ‌కులు ఇళ్ల‌లోనే ఉంటూ నిర‌స‌న దీక్ష‌లు చేయాల‌ని ఆదేశించారు. క‌రోనా క‌ష్టాల‌తో ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లుతుంటే ఆదుకునే చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా వైసిపి ప్ర‌బుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పెనం మీద ఉన్న ప్ర‌జ‌ల‌ను పొయ్యిలోకి నెట్టింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉపాధి కోల్పోయిన పేద‌ల ఊపిరి తీస్తున్నార‌న్న చంద్ర‌బాబు..ఇది క‌రెంట్ బిల్ల‌లు పెంచే స‌మ‌య‌మా అని ధ్వ‌జ‌మెత్తారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌జానీకం ఉంటే..దొడ్డిదారిన క‌రెంట్ బిల్లులు పెంచ‌డం హేయ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. టిడిపి ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేద‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నామ‌న్నారు. మ‌ళ్లీ టిడిపి అధికారంలోకి వ‌స్తే విద్యుత్ ఛార్జీలు త‌గ్గిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించామ‌న్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచ‌మ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని, ఒక్క ఛాన్స్ అంటూ అడిగి తీసుకొని, తీరా ప‌ద‌వి చేప‌ట్టాక మాట త‌ప్పి ఛార్జీలు పెంచ‌డం దారుణ‌మోస‌మ‌ని విమ‌ర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని, ఫిబ్ర‌వ‌రి బిల్లుకు స‌మాన‌మైన బిల్ల‌ల‌నే లాక్‌డౌన్ 3 నెల‌ల్లో కూడా క‌ట్టించుకోవాల‌ని డిమాండ్ చేశారు. శ్లాబుల‌ను మార్చే చ‌ర్య‌ల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని సూచించారు. నిర‌స‌న దీక్ష‌ల ద్వ‌రా రాష్ట్ర‌ప్ర‌భుత్వం టిడిపి నాయ‌కుల ఒత్తిడి తేవాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. 

No comments:

Post a Comment