Tuesday, May 26, 2020

నెక్ట్స్ టార్గెట్ తెలుగురాష్ట్రాలే..@మిడ‌త‌ల దండు గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు..

ఢిల్లీ: దేశాన్ని క‌రోనా వైర‌స్ ప‌ట్టి పీడిస్తుంటే ప‌శ్చిమ భార‌త రాష్రాల‌ను మిడ‌త‌లు చుట్టుముట్టాయి. పొరుగుదేశం పాకిస్థాన్ నుంచి వ‌చ్చిన మిడ‌త‌ల దండు భార‌త్‌లోని పంట పొలాల‌ను నాశ‌నం చేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌పై వీటి ప్ర‌భావం విప‌రీతంగా ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీకి వీటి ముప్పు ఇప్ప‌టిలో త‌ప్పేలా లేద‌ని హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి.
మిడ‌త‌ల‌కు ఎలాంటి పంట అనేది సంబంధం ఉండ‌దు. ప‌చ్చ‌గా ఏది క‌న‌ప‌డితే దాన్ని శుభ్రంగా ఆర‌గిస్తాయి. మిడ‌త‌ల దండు పొలంలో పండిందంటే ఇక ఆ పొలంలో ఏదీ మిగ‌ల‌దు. కొన్నిగంట‌ల్లోనే అక్క‌డ ఒక పంట ఉన్న‌ద‌న్న సంగతే తెలియ‌కుండా స‌ర్వ‌నాశ‌నం చేస్తాయి. మ‌రి అలాంటి మిడ‌త‌ల గురించి ఇప్పుడు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం...
 • ప‌శ్చిమ భార‌తంలో  పంట‌పొలాల‌పై దాడి చేస్తోన్న మిడ‌త‌లు మ‌న ఇంటి ప‌రిస‌రాల్లో చూసే మిడ‌త‌ల మాదిరిగానే ఉంటాయి. కాక‌పోతే మ‌న ఇంటి వ‌ద్ద ఒక‌టి రెండు మిడ‌త‌లు క‌న‌ప‌డితే.. అక్క‌డ మాత్రం వేలు, ల‌క్ష‌ల సంఖ్య‌లో ఒక్క‌సారిగా వ‌స్తాయి.
 • మిడ‌త‌లు కేవ‌లం మొక్క‌ల‌ను మాత్ర‌మే తింటాయి. పొడి వాతావ‌ర‌ణంలో ఇవి ఎక్కువుగా తిరుగుతాయి.వ‌ర్షాలు ప‌డ‌గానే వాటి సంతానోత్ప‌త్తి పెరిగి తీవ్ర ద‌శ‌కు చేర‌తాయి.
 • ఎడారి మిడ‌త‌లుగా కూడా వీటిని పిలుస్తారు. ఇవి వేగంగా ప్ర‌యాణించ‌గ‌ల‌వు. ఒక్క రోజులో 150 కి.మీ వ‌ర‌కూ ఇవి ప్ర‌యాణిస్తాయ‌ట‌. వాటికి ఓపిక కూడా ఎక్క‌వ. అధిక సమ‌యం గాలిలోనూ ఎగురుతూ కూడా ఉండ‌గ‌ల‌వు.
 • ఇవి పంట‌ల‌కు తీవ్ర న‌ష్టాన్ని చేస్తాయి. పొలంపై ప‌డితే ఆ పంట‌పై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. ప్ర‌తి మిడ‌తా దాని బ‌రువుక‌న్నా కాస్త ఎక్క‌వుగానే లాంగిచేయ‌గ‌ల‌వు. 
 • కి.మీ . ప‌రిధిలో గ‌ల ప్రాంతాన్ని 80 మిలియ‌న్ల మిడ‌త‌లు ఆక్ర‌మించ‌గ‌ల‌వు. అంతేకాదు, 35 వేల మందికి స‌రిపోయే ఆహారాన్ని ఒక్క రోజులో తినేస్తాయి. 
 • ఏడారి మిడ‌త‌ల జీవితం కాలం 90 రోజులు. ఈ కాలంలో అవి రెండు గుడ్లు పెడ‌తాయి. ఆరువారాల్లో అవి పెరిగి పెద్ద‌వి అవుతాయి. అలా పెరిగి పెద్ద‌యిన మిడ‌త‌లు నెల రోజుల్లో మ‌ళ్లీ గుడ్లు పెడ‌తాయి. 
 • వీటి సంతానోత్ప‌త్తి గ‌ణ‌నీయంగా ఉంటుంది. మూడు నెల‌ల్లో ఇవి 20 రెట్లు పెరుగుతాయి. ఆరు నెల‌ల్లో 400 రెట్ల‌కు, 9 నెల‌ల్లో 8 వేల రెట్ల‌కు  ఇవి పెరుగుతాయి. 

 • ప్ర‌స్తుతం భార‌త‌దేశంపై దాడి చేస్తున్న ఈ మిడ‌త‌ల జ‌న్మ‌స్థానం తూర్పు ఆఫ్రికా, సూడాన్‌. అవి అక్క‌డి నుంచి మొద‌లై సౌదీ అరేబియా, ఇరాన్‌, పాకిస్థాన్ కు వ‌చ్చాయి. పాక్ నుంచి ఇప్పుడు భార‌త్‌లోకి ప్ర‌వేశించాయి. 
  • ఈ మిడ‌త‌ల దండు తొలుత రాజ‌స్థాన్ లో ప్ర‌వేశించి ఆ త‌ర్వాత ప‌శ్చిమ భార‌తంలోని రాష్ట్రాల‌కు విస్త‌రించింది. రాజ‌స్థాన్‌లో మొత్తం 33 జిల్లాలు ఉండ‌గా, 16 జిల్లాల్లో మిడ‌త‌ల ప్ర‌భావం ఉంది. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఖ‌రీఫ్‌కు గ‌డ్డుకాల‌మే.
  • మిడ‌త‌ల దండును ఇప్పుడు నియంత్రించ‌లేక‌పోతే 8 వేల కోట్ల విలువైన పెస‌ర‌పంట నాశ‌నం అవుతుంద‌ని వ్య‌వ‌సాయ నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తంచ చేస్తున్నారు. 
  • ప్ర‌పంచంలోని ఇత‌ర వ‌ల‌స కీట‌కాల‌తో పోలిస్తే, మిడ‌త‌ల దండు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని యునైటెడ్ నేష‌న్స్ కు చెందిన ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ వెల్ల‌డించింది. వీటి వ‌ల్ల ఆహార సంక్షోభం ఏర్ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
  • గ్లోబ‌ల్ వార్మింగ్ (భూతాపం) కార‌ణంగా మిడ‌త‌ల దండులు, అవి చేసే దాడులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వ‌ర్షాలు ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల భూతాపం పెరిగి, మిడ‌త‌లు మ‌రింత విజృంభించే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. 

  No comments:

  Post a Comment