Friday, May 29, 2020

లాక్‌డౌన్ నిర్ణ‌యం..స‌ర్వే చేసిన‌త‌ర్వాత‌నే..!

హైద‌రాబాద్(Hyderabad):
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌రోనా కేసుల‌పై భార‌త వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి(ఐసీఎంఆర్‌)స‌ర్వేలైన్స్ స‌ర్వే నిర్వ‌హించ‌నుంది. హైద‌రాబాద్‌లోని 5 కంటైన్మెంట్ జోన్ల‌లో రెండు రోజుల పాటు జాతీయ పౌష్టికాహార ప‌రిశోధ‌నా సంస్థ టీమ్స్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం నుంచి ఐసీఎంఆర్ ఈ స‌ర్వే  చేప‌ట్ట‌నుంది. న‌గ‌రంలోని ఆదిభ‌ట్ల‌, బాలాపూర్‌, మియాపూర్‌, చందాన‌గ‌ర్ , ట‌ప్పా చ‌బుత్రా ప్రాంతాల్లో స‌ర్వేలైన్స్ జ‌ర‌గ‌నుంది. అందుకు సంబంధించి 5 ప్రాంతాల్లో 10 ప్ర‌త్యేక టీమ్‌ల ద్వారా స‌ర్వేకు ఏర్పాట్లు చేశారు. ఈ ఐదు కంటైన్మెంట్ జోన్ల‌లో క‌రోనా కేసులు, వాటి ప‌రిస్థితి, ల‌క్ష‌ణాల‌పై ఇంటింటా స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. స‌ర్వే ద్వారా హైద‌రాబాద్‌లో పెరుగుతున్న కేసులు, నాస్ సింప్ట‌మిక్ కేసుల‌పై ఐసీఎంఆర్ పూర్తిస్థాయి నివేదిక త‌యారుచేయ‌నుంది. 
ఇప్ప‌టికే తెలంగాణ‌లోని అనేక ప్రాంతాల్లో ఐసీఎంఆర్ స‌ర్వే పూర్తి చేసింది. వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణ‌యాన్ని ఐసీఎంఆర్ నివేదిక‌ల ఆధారంగానే కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటూ వ‌స్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 60 జిల్లాల్లో స‌ర్వే నిర్వ‌హించి, 24 వేల శాంపిల్స్ ను సేక‌రించారు. నాలుగు కేట‌గిరీల కింద ఈ స‌ర్వే నిర్వ‌హించ‌బ‌డుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌గామ‌, కామారెడ్డి, న‌ల్గొండ జిల్లాల్లో ఇప్ప‌టికే ఈ స‌ర్వే జ‌రిపారు. వైర‌స్ ట్రాన్స్‌మిష‌న్ ఏమైనా జ‌రిగిందా..!? ఎవ‌రికైనా వైర‌స్ సోకిన త‌ర్వాత యాంటీ బాడీస్ పెరిగాయా..?    లాంటి అంశాల‌ను ప‌రిశీలిస్తూ ఈ స‌ర్వేను నిర్వ‌హించ‌నున్నారు. ఇవి చ‌ద‌వండి: వైసీపీకి షాక్ ..

వ‌ల‌స‌కార్మికుల మ‌ర‌ణాల నేప‌థ్యంలో..

రైల్వే శాఖా మంత్రి ట్వీట్‌

న్యూఢిల్లీ(New Delhi) :  తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న‌వారు, గ‌ర్భిణీ స్త్రీలు, ప‌దేళ్ల‌లోపు, 65 ఏళ్లు పైబ‌డిన వారెవ్వ‌రూ కూడా అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పించి శ్రామిక రైళ్ల‌లో ప్ర‌యాణించ‌రాదు. అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ప్ర‌జ‌ల‌కు శుక్ర‌వారం వెల్ల‌డించారు. ప్ర‌యాణికుల అంద‌రి భ‌ద్ర‌త‌కు రైల్వే సిబ్బంది అండ‌గా నిలుస్తార‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. గ‌త సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు నాలుగు రోజుల్లోనే శ్రామిక రైళ్ల‌లో 9 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించిన అసాధ‌ర‌ణ ప‌రిస్థితుల‌పై గోయ‌ల్ స్పందించారు. 
దేశవ్యాప్తంగా వ‌ల‌స కార్మికుల‌ను త‌మ స్వ‌గ్రామాల‌కు పంపించేందుకు తాము ప్ర‌తిరోజూ ప్ర‌త్యేక శ్రామిక రైళ్ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, అయితే కొంత మంది అనార్యోగంతో బాధ ప‌డుతున్న వారు కూడా ఈ రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డం వ‌ల్ల దుర‌దృష్ట‌వ‌శాత్తు వారు మృత్యువాత ప‌డ్డార‌ని రైల్వే శాఖ అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే మ‌ధుమేహం, గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న రైల్వే ప్ర‌యాణిల‌కు ట్యాబ్లెట్లు వేసుకునేందుకు క‌నీసం మంచినీరు కూడా దొర‌క్క‌పోవ‌డంతో వారు మ‌ర‌ణించార‌ని మృతుల బంధువులు వాపోయారు. 
ఎండ‌లు తీవ్ర‌మైన నేప‌థ్యంలో మంచినీళ్ల అవ‌స‌రం మ‌రింత పెరిగింద‌ని వ‌ల‌స కార్మికులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సాయం ఏది అవ‌స‌ర‌మైనా త‌మ 138,139 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాల‌ని రైల్వే శాఖ విజ్ఞ‌ప్తి చేసింది. వ‌ల‌స కార్మికులకు ఉచిత ప్ర‌యాణం  క‌ల్పించ‌డంతోపాటు ఉచితంగా అన్న పానీయాల‌ను అందించాల్సిన బాధ్య‌త కూడా ప్ర‌భుత్వానుదేనంటూ సుప్రీం కోర్టు శుక్ర‌వారం ఉత్త‌ర్వులు చేయ‌డం గ‌మ‌నార్హం.

No comments:

Post a Comment