వాషింగ్ట‌న్: అమెరికాను ఘ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ నుండి త‌ప్పించుకునేందుకు ముందు జాగ్ర‌త్త‌గా తాను మ‌లేరియా ఔష‌ధ‌మైన హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నాన‌ని అమెరికా అధ్య‌క్షులు డొనాల్డ్ ట్రంప్ వెల్ల‌డించారు. 10 రోజుల నుంచి ఈ మాత్ర‌లు వేసుకుంటున్న‌ట్లు తెలిపారు. త‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌లేద‌ని పేర్కొన్నారు. శ్వేత‌సౌధంలోని వైద్యులు సూచింక‌పోయిన‌ప్ప‌టికీ..తాను ఈ ఔష‌ధాన్ని వాడుతున్నాన‌ని తెలిపారు. తాను క్లోరోక్విన్ తీసుకోవాల‌నుకుంటున్నాన‌ని వైద్యుడితో చెబితే ఆయ‌నేమీ అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని వివ‌రించారు. రోజుకు ఓ మాత్ర చొప్పున వేసుకుంటున్న‌ట్లు తెలిపారు. క‌రోనాపై పోరులో ముందు వ‌రుస‌లో ఉన్న అనేక‌మంది వీటిని వాడుతున్నార‌ని పేర్కొన్నారు. వారిలో మెరుగైన ఫ‌లితాలు ఉన్న‌ట్లు గ‌మ‌నించామ‌ని అందువల్లే తాను తీసుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌లు తీసుకుంటున్నాన‌ని ట్రంప్ వెల్ల‌డించిన కొద్ది సేప‌టికే శ్వేత‌సౌధం వైద్య‌వ‌ర్గాలు స్పందించాయి. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నార‌ని ప్ర‌క‌టించాయి. త‌రుచూ కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నార‌ని, ఇప్ప‌టివ‌ర‌కు అవ‌న్నీ నెగిటివ్‌గానే వ‌చ్చిన‌ట్టు డాక్ట‌ర్ కోన్లీ తెలిపారు.
ఇటీవ‌ల శ్వేత‌సౌధంలో ప‌లువురి సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. వీరిలో ఒక‌రు ట్రంప్ స‌హాయ‌కుడు సైతం ఉండ‌టంతో అక్క‌డి వైద్యులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 15,37,830 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. వీరిలో 2,88,842 మంది కోలుకొని ఇళ్ల‌కు చేర‌గా..90,694 మంది మృతి చెందారు. 

Post a Comment

Previous Post Next Post