Monday, May 18, 2020

సీపీఐ(ఎం) నేత‌ల‌పై కేసులు ఉప‌సంహ‌రించుకోవాలి

రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ్ర‌దం

ఖ‌మ్మం: ఖ‌మ్మంలో సీపీఐ(ఎం) నాయ‌కుల‌పై పోలీసులు న‌మోదు చేసిన కేసుల‌ను ఉప‌సంహ‌రించేలా జిల్లా మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ప్ర‌భుత్వం, పోలీసు అధికారులు జోక్యం చేసుకోవాల‌ని ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం కోరారు. సోమ‌వారం ఖ‌మ్మంలోని సుంద‌ర‌య్య భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు పోతినేని సుద‌ర్శ‌న్‌రావు, జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వ‌ర‌రావు తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.  పోలీసులు కేసులు న‌మోదు చేయడాన్ని రాష్ట్ర క‌మిటీ తీవ్రంగా ఖండిస్తోంద‌న్నారు. లాక్‌డౌన్ తో తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌ల‌ను ఆదుకోవాల‌ని, కార్డుల్లేని వారికి రేష‌న్ అందించాల‌నీ, రైతులు ఇబ్బందులు తొల‌గించాల‌ని కోరుతూ శ‌నివారం ఖ‌మ్మంలో భౌతిక దూరం పాటిస్తూ, నిబంధ‌న‌ల మేర‌కు మాస్కులు ధ‌రించి నిర‌స‌న తెలిపిన వారిపై అక్ర‌మంగా కేసు పెట్టార‌నీ, ఇది దారుణ‌మ‌నీ పేర్కొన్నారు. అదే రోజున బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా, వారిపై కేసులు న‌మోదు చేయ‌కుండా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించిన సీపీఐ(ఎం) నేత‌ల‌పై కేసులు పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. 
క‌రోనా క‌ట్ట‌డిలో తెలంగాణ ప్ర‌భుత్వం అంతా తామే చేస్తున్నామ‌నే నియంతృత్వ దోర‌ణిని క‌లిగి ఉంద‌న్నారు. కోవిడ్ నేప‌థ్యంలో అంతా క‌లిసి యుద్ధం చేయాల‌న్న అభిప్రాయం క‌లిగిలేద‌న్నారు. దేశంలో కాక‌, ప్ర‌పంచంలోనే కేర‌ళ రాష్ట్రం కోవిడ్ నియంత్ర‌ణ‌లో ఆద‌ర్శంగా నిలుస్తోంద‌న్నారు. రాష్ట్రంలో తొలికేసు న‌మోదైనా అక్క‌డ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ప్రత్యేక ప్ర‌ణాళిక‌, ప‌టిష్ట‌మైన ఆరోగ్య వ్య‌వ‌స్థ‌, పంపిణీ వ్య‌వ‌స్థ , వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకునేలా రూ.20 వేల కోట్లు  విలువైన‌, ఆర్థిక ప్యాకేజీని అమ‌లు చేయ‌డంతో కేర‌ళ‌లో కోవిడ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రించ‌గ‌లిగార‌న్నారు. 

No comments:

Post a Comment