Thursday, May 28, 2020

రాబ‌డి లేదు..కోత త‌ప్ప‌దు: సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్: లాక్‌డౌన్ ఫ‌లితంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప‌డిపోయింద‌ని, నిబంధ‌న‌లు స‌డ‌లించినా రాబ‌డి పెర‌గ‌లేద‌ని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలిపారు. రాష్ట్రానికి ప్ర‌తినెలా రూ.12 వేల కోట్ల రాబ‌డి రావాల్సి ఉండ‌గా మే నెల‌లో కేవ‌లం రూ.3100 కోట్లు మాత్ర‌మే వ‌చ్చింద‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితుల్లో మే నెల వేత‌నాల్లో కూడా కోత కొన‌సాగుతుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌జాప్ర‌తినిధుల వేథ‌నాల్లో 75 శాతం, అఖిల భార‌త స‌ర్వీసు అధికారుల వేత‌నాల్లో 60 శాతం, ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల్లో 50 శాతం, ప‌ద‌వీ విర‌మ‌ణ ఉద్యోగుల పింఛ‌న్ల‌లో 25 శాతం, పొరుగుసేవ‌లు, ఒప్పంద ఉద్యోగుల వేత‌నాల్లో ప‌ది శాతం కోత కొన‌సాగుతుంది. అప్పుల కిస్తీల‌ను విధిగా చెల్లించాల‌ని, ఆస‌రా పింఛ‌న్ల‌ను య‌థావిధిగా అందించాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. పేద‌ల‌కు ఇస్తున్న 12 కిలోల బియ్యాన్ని జూన్ నెల‌లో కూడా అందిస్తారు. లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో కార్మికుల‌కు ప‌నులు దొరికే అవ‌కాశం ఉన్నందున పేద‌ల‌కు ప్ర‌తినెలా  ఇస్తున్న రూ.1500 న‌గ‌దు పాయాన్ని జూన్ నెల‌లో నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ముఖ్య‌మంత్రి బుధ‌వారం రాష్ట్ర ఆర్థ‌కి ప‌రిస్థితిపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్ , ఆర్థిక శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి కార్యాల‌య ముఖ్య‌కార్య‌ద‌ర్శి న‌ర్సింగ్‌రావు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

జూన్ నుంచి  ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మాలు..

రాష్ట్రంలోని అన్ని ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో జూన్ 1 నుంచి 8 వ‌ర‌కు ప‌రిశుభ్ర‌త -పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌తో పాటు, రాబోయే వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌భ‌ల‌కుండా ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ప‌ల్లెల్లో, ప‌ట్ట‌ణాల్లో జూన్ మొద‌టి వారంలో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. పుర‌పాల‌క మంత్రి కేటీఆర్, ముఖ్య‌కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌, సంచాల‌కుడు స‌త్య‌నార‌య‌ణ‌, పంచాయ‌తీ రాజ్ క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment