Monday, May 25, 2020

భ‌‌రించ‌లేపోతున్నాం..!

  • మార్చురీ నుంచి దుర్వాస‌న‌
  • కాల‌నీ వాసులు ఆందోళ‌న‌
    dead body

హైద‌రాబాద్: సికింద్రాబాద్ గాంధీప్ర‌భుత్వ ఆస్పత్రి మార్చురీ నుంచి వెలువ‌డుతున్న తీవ్ర దుర్వాస‌న‌ను తాము భ‌రించ‌లేక‌పోతున్నామ‌ని అభిన‌వ‌న‌గ‌ర్ కాల‌నీవాసులు వాపోతున్నారు. ఈ మేర‌కు కాల‌నీ అసోసియేష‌న్ అధ్య‌క్షులు ఆర్‌.రాజేష్ గౌడ్ ఆదివారం ప‌ద్మారావు న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. గ‌త 10 రోజుల నుండి గాంధీ ఆస్ప‌త్రి మార్చురీ నుంచి వ‌స్తున్న దుర్వాస‌న వ‌ల్ల తాము తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నామ‌న్నారు. మార్చురీలోని ఏసీ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో అక్క‌డ నిల్వ ఉంచిన మృత‌దేహాల నుంచి ప‌క్క‌నే ఉన్న కాల‌నీల‌కు భ‌రించ‌లేని విధంగా దుర్వాస‌న వెద‌జ‌ల్లుతుంద‌న్నారు. ఈ విషమై గాంధీ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ ఇత‌ర అధికారుల‌కు విన్న‌వించినా ఫ‌లితం లేద‌న్నారు. దుర్వాస‌న వ‌ల్ల ప‌ద్మారావున‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని వంద‌లాది కుటుంబాలు తీవ్ర అసౌక‌ర్యానికి లోన‌వుతున్నాయ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని తాము రాష్ట్ర మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, కేటీఆర్ , త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ దృష్టికి తీసుకెళ్లామ‌న్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో అధికార యంత్రాంగం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ప‌ద్మారావున‌గ‌ర్ కాల‌నీవాసులతో క‌లిసి గాంధీ ఆస్ప‌త్రి ఎదుట పెద్దఎత్తున ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. వెంట‌నే రాష్ట్ర వైద్య విద్య సంచాల‌కులు డాక్ట‌ర్ ర‌మేష్‌రెడ్డి, వైద్యఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి శాంత‌కుమారి జోక్యం చేసుకొని స‌మ‌స్య‌ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాల‌నీ అధ్య‌క్షులు రాజేష్ గౌడ్ విజ్ఞ‌ప్తి చేశారు. 

No comments:

Post a Comment