Friday, May 22, 2020

సంత‌కం చేశాం..వైర‌స్ వ‌చ్చింది..!

చైనాపై మండిప‌డుతున్న ట్రంప్‌
వాషింగ్ట‌న్: క‌రోనా వైర‌స్ ముమ్మాటికీ చైనా నుంచే వ‌చ్చింద‌ని..ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని అమెరికా అధ్య‌క్షులు డొనాల్డ ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో స‌త్సంబంధాల‌ను పెంపొందించుకోవాల‌న్న ఉద్ధేశ్యంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చు కున్నామ‌ని, కానీ, కొన్ని రోజుల‌కే ఆ దేశం నుంచి వైర‌స్ వ‌చ్చిప‌డ‌టం తీవ్ర నిరాశ‌కు గురిచేసింద‌ని వ్యాఖ్యానించారు. గురువారం ఆఫ్రిక‌న్‌-అమెరిక‌న్ నేత‌ల‌తో మిషిగ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.
గ‌త కొన్ని రోజులుగా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ట్రంప్‌..చైనాపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే.. మ‌రో వైపు చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. చైనాపై క‌చ్చితంగా ప్ర‌తీకారం తీర్చుకోవాల్సిందేన‌ని ప్ర‌ధానంగా రిప‌బ్లిన్ పార్టీ ప్ర‌తినిధులు డిమాండ్ చేస్తున్నారు. చైనా త‌ప్పిదం వ‌ల్లే ప్రపంచానికి ఈ దుస్థితి త‌లెత్తింద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ డ్రాగ‌న్ పై క‌ఠిన ఆంక్ష‌లు విధించాల‌ని కోరుతున్నారు. అయితే, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌నే అంశంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 
జాతీయ జెండా అవ‌న‌తం...
కోవిడ్‌-19 తో పోరాడుతూ మ‌ర‌ణించిన వారి సంఖ్య 95 వేలు దాటిన నేప‌థ్యంలో వారంద‌రికీ సంతాప సూచికంగా దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు జాతీయ జెండాను అవ‌న‌తం చేయాల‌ని ట్రంప్ ఆదేశించారు. అన్ని జాతీయ కార్యాల‌యాలు, చారిత్ర‌క ప్ర‌దేశాలు స‌హా ఇత‌ర ప్ర‌ముఖ స్థ‌లాల్లో ఉన్న జాతీయ జెండాల‌ను
అవ‌న‌తం చేయాల‌ని కోరారు. మృతుల సంఖ్య ల‌క్ష దాటుతున్న నేప‌థ్యంలో వారంద‌రి గౌర‌వార్థం ఈ చ‌ర్య‌ను చేప‌ట్టాల‌ని డెమొక్ర‌టిక్ స‌భ్యుల నుంచి డిమాండ్ వ‌చ్చిన నేప‌థ్యంలో ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment