Friday, May 29, 2020

లాక్‌డౌన్‌-5 వ‌స్తుందా..? మే-31 త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతోంది?

న్యూఢిల్లీ (New Delhi) :
ఇండియాలో లాక్‌డౌన్ -4.0  ముగియ‌డానికి మ‌రో రెండ్రోజులే మిగిలి ఉన్నాయి. భ‌విష్య‌త్తు వ్యూహం ఎలా ఉండాల‌న్న దానిపై గురువారం నాడు హోంమంత్రి అమిత్‌షా వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 
ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మాట్లాడుతూ వ‌చ్చారు. అయితే అమిత్‌షా స‌మావేశానికి ముందు క్యాబినేట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గ‌బా వివిధ రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో మాట్లాడారు. అత్య‌ధిక కేసులు ఉన్న 13 న‌గ‌రాల‌పై వారు ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. 
ఈ చ‌ర్చ‌ల నేప‌థ్యంలో లాక్‌డౌన్ -5.0 వ‌స్తుందా..? అన్న చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా మొద‌లైంది. మ‌రి వ‌స్తే ఆ లాక్‌డౌన్ -5.0 ఎలా ఉండ‌బోతోంది..?
లాక్‌డౌన్‌-4.0 లో స‌డ‌లింపుల కార‌ణంగా దేశంలో క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం ముందుగానే ఊహించింది. కానీ ఐదు రాష్ట్రాల‌లోనే అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంపై కేంద్రం ఆందోళ‌న చెందుతోంది. కాబట్టి ఈ సారి లాక్‌డౌన్ ఉంటే, ఈ రాష్ట్రాల‌పై కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. అంతేకాదు లాక్‌డౌన్ విష‌యంలో ఈ సారి రాష్ట్రాల‌కు ఎక్కువ హ‌క్క‌లు క‌ట్ట‌బెట్టే అవ‌కాశం కూడా లేద‌న‌లేము. 
క‌రోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల‌కు విమానాల‌ను త‌క్కువుగా న‌డ‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని తాము అభ్య‌ర్థించిన‌ట్లు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప ట్వీట్ చేశారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో వ‌చ్చేవారిపై ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని, రైళ్లు ఎటూ న‌డుస్తాయో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌న ట్వీట్‌లో పేర్కొంది. 
రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ వ‌స్తే నిబంధ‌న‌ల విధింపులో రాష్ట్రాలు కీల‌క పాత్ర పోషించ‌వ‌చ్చ‌న‌డానికి ఇది సంకేతంగా క‌నిపిస్తోంది. ముఖ్య‌మంత్రుల‌తో హోంమంత్రి స‌మావేశానికి ముందు జార్ఖాండ్ ముఖ్య‌మంత్రి హేమంత్  సొరేన్ లాక్‌డౌన్ ఆంక్ష‌ల్ని మ‌రింత క‌ఠినంగా, వేగ‌వంతంగా అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేంద్రం తీసుకునే నిర్ణ‌యాల‌ను త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌న్నారు. 
మ‌రో వైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన కొన్ని స‌డ‌లింపుల‌పై త‌మ ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంద‌ని మ‌హారాష్ట్ర మంత్రి జ‌యంత్‌పాటిల్ రెండ్రోజుల కింద‌ట వ్యాఖ్యానించారు. అయితే తాము కేంద్రం నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 
ఇక ఇటీవ‌లే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ స్థానంలో కర్ఫూ విధించింది. 
వివిధ రాష్ట్రాలు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే ఇక ముందు రాష్ట్రాలే త‌మ స్థాయిలో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌పై నిర్ణ‌యాలు తీసుకుంటాయ‌న్న అభిప్రాయం క‌లుగుతోంది.
ఈ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. ఈ సారి కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌చ్చు. కానీ రాబోయే 15 రోజుల్లో వేటిని నిషేధించాలి, వేటికి అనుమ‌తించాలి అన్న‌దానిపై కొన్ని నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. 
రెడ్‌జోన్‌లో వ్యాపారాల ప‌రిస్థితి..!
లాక్‌డౌన్‌-4.0 కు ముందు ప‌రిశ్ర‌మ‌లు ఆర్థిక ప్యాకేజీని డిమాండ్ చేశాయి. ఇప్పుడు వారి డిమాండ్ నెర‌వేరింది. చాలా చోట్ల ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ఇప్పుడు వారి స‌మ‌స్య కొత్త‌గా కార్మికుల‌ను నియ‌మించుకోవ‌డం కాదు..ఇప్పుడున్న వారితో ఎలా ప‌నిచేయించుకోవాల‌న్న‌దే వారికి ముఖ్యం. 
ప్ర‌స్తుతానికి రిటైల్ వ్యాపారాలు ఓపెన్ తెరిచినా వాటిలో కస్ట‌మ‌ర్లు లేరు. ఉద్యోగులూ లేరు. తెరిచే షాపుల‌కు కూడా ప‌రిమిత స‌మ‌యంలోనే అనుమ‌తిస్తున్నారు. ఇప్పుడు 10 శాతం షాపులు మాత్ర‌మే తెరుచుకుంటున్నాయ‌ని కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ‌ర్స్ (క్యాట్‌) జాతీయ అధ్య‌క్షులు ప్ర‌వీణ్ ఖండేల్వాల్ చెప్పారు. తెర‌వ‌డానికి అనుమ‌తి ఉన్నా వ్యాపారుల్లో భ‌యం మాత్రం అలాగే ఉంది. రెడ్‌జోన్‌లో ఉన్న కొన్ని మార్కెట్లు ఇప్ప‌టికీ మూసివేసే ఉన్నాయి. వేలాది దుకాణాలున్న ఢిల్లీ స‌ద‌ర్ హోల్‌సేల్ మార్కెట్ లాంటివి పూర్తిగా మూసేసి ఉన్నాయి. అయితే షాపులు తెరిచి ఉంచే వేళ‌ల‌ను పెంచాల‌ని, త‌ద్వారా ఆదాయం పెరుగుతుంద‌ని వ్యాపారులు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యుత్‌, నీటి బిల్ల‌లుపై కూడా రాయితీలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 
మెట్రోలు, రైళ్లు సిద్ధం..
మెట్రోల‌ను న‌డ‌ప‌డానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామ‌ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ తెలిపింది. కానీ కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి అనుమ‌తులు రాలేద‌ని పేర్కొంది. ఢిల్లీలో ఒక్క గురువారం రోజే వెయ్యి కిపైగా కొత్త  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇటువంటి ప‌రిస్థితిలో, మెట్రోను న‌డ‌పాల‌ని నిర్ణ‌యం ప్ర‌మాద‌క‌ర‌మే కావ‌చ్చు. కానీ మెట్రో రైలు రెండు నెల‌లుగా మూసేయ‌డంతో ఆదాయం లేక నిధులు లోటులో కూరుకుపోతోంది. 
ఆల‌యాలు‌, ప్రార్థ‌నా స్థ‌లాలు అనుమ‌తి కోసం ఎదురుచూపు..!
లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్లో స‌డ‌లింపులు పెరుగుతున్నందున అదే క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం జూన్ 1 నుంచి కొన్ని దేవాల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చీల‌ను తెర‌వ‌డానికి అనుమ‌తి ఇచ్చింది. ఒక్క క‌ర్ణాట‌క‌లోనే దేవాల‌యాల‌లో పూజ‌లు నిలిపివేయ‌డం వ‌ల్ల సుమారు రూ.133.56 కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని అంచ‌నా. పూజారుల‌కు ఇత‌ర సిబ్బందికి జీతాలు ఇవ్వ‌డంలో ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. కేర‌ళ‌లోనూ దేవాల‌యాల‌లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. శ‌బ‌రిమ‌లై తెరుచుకోక‌పోవ‌డంతో ఆదాయం పూర్తిగా ప‌డిపోయింది. మ‌రి మ‌ద్యం దుకాణాలు తెరుస్తారు కానీ, గురుద్వారాల‌ను తెర‌వ‌రా అంటూ పంజాబ్ లో అకాల్ త‌ఖ్త్ ప్ర‌శ్నించింది. కానీ దేవాల‌యాల‌ను తెరిస్తే నైవేద్యాలు, పూజ‌లు, పంపిణీ కార్య‌క్ర‌మాల వ‌ల్ల అతి పెద్ద స‌మస్య‌గా మారనుంది. క‌రోనా వ్యాప్తి భ‌యంతో దేన్ని తాకినా చేతులు క‌డుక్కోవాలి. 
సినిమాల్లేవు..షూటింగ్‌ల్లేవు..!
గ‌త రెండు నెల‌లుగా సీరియ‌ళ్ల‌లో కొత్త ఎపిసోడ్లు లేవు. సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి. ఇటీవ‌ల అక్ష‌య్‌కుమార్ ఓ షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు తెలిసింది. అయితే ప్ర‌భుత్వం కోసం తీస్తున్న వీడియో కోసం ఆయ‌న ఈ షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు చెబుతున్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ మీద ఆధార‌ప‌డి వేల‌మంది జీవిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లో మే 28న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం సినిమాల‌కు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అక్క‌డ‌క్క‌డా ప్రారంభ‌మ‌వుతున్నాయి. అయితే అవి కేవ‌లం గ్రీన్ జోన‌ల‌లోనే జ‌రుగుతున్నాయి. క‌రోనాను ఎదుర్కోవ‌డంలో భాగంగా చికిత్స‌ల‌లో వారికి కొన్ని రాయితీలు కూడా ల‌భిస్తున్నాయి. 
ఇక మాల్స్‌, థియోట‌ర్లు, స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్ల‌లో కూర్చొని భోజ‌నాల‌కు మాత్రం ఇప్ప‌ట్లో అనుమ‌తి ఇచ్చే ప‌రిస్థితి లేదు. వీటి కోసం మ‌రింత కాలం ఎదురుచూడాల్సిందే. 
మొత్తంగా లాక్‌డౌన్ -5.0 పై పూర్తి క్లారిటీ రెండ్రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉంది. 


No comments:

Post a Comment