Wednesday, January 29, 2020

ఇక వాహన 'ఫ్యాన్సీ నెంబర్లు' సులభం

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ
హైదరాబాద్‌ : వాహనదారులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్లు కోసం అధికారులు, రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా  ఈ -బిడ్డింగ్‌ ద్వారా పొందేందుకు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్‌ ఆర్‌టిఏ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తన కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్‌టిసికి ప్రచారకర్తగా వ్యవహరిస్తారన్నారు. త్వరలో కొత్త నినాదాలు, సీఎం చిత్రపటాలతో ప్రచారం చేపడతామని పేర్కొన్నారు. ఆర్‌టిసీ కార్గో సేవలను ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే 50 కార్గో బస్సులను సిద్ధంగా ఉంచామని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్‌టీసీకి ఒక్కరోజులోనే రూ.16.80 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఈ బిడ్డింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు నేటినుంచే అందుబాటులో ఉంటాయని వివరించారు.
వాహనాల నెంబర్‌ పోర్టబులిటీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ విధానం ద్వారా రవాణా శాఖకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థికమాంద్యం ప్రభావం రవాణా శాఖపై పడిందని, వాహన కొనుగోళ్లు తగ్గడంతో రెవెన్యూ 14 శాతం నుంచి 11 శాతానికి పడిపోయిందన్నారు. ఆర్‌టీసీ కార్మికులతో అధికారులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా తన వాట్సాప్‌ నెంబర్‌ 98495-55778కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఈ సారి బడ్జెట్‌లో రవాణా శాఖకు రూ.1500 కోట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతామని మంత్రి వెల్లడించారు. ఆర్‌టిసీ ఉద్యోగులకు మార్చి 31వ తేదీలోపు సమ్మె కాలపు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు 4 వేల బస్సులు నడుపుతున్నామని అక్కడ ఓ బేస్‌ క్యాంపును కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. 

No comments:

Post a Comment