Monday, January 27, 2020

ఆ నలుగురి..కలిసి 'ఒక్కడై'..!

షరీఫ్‌ చాచా..నీకు సలాం

ఉత్తర్‌ ప్రదేశ్‌ : అతను 82 ఏళ్ల వృద్ధుడు..అతని శరీరం బలహీనపడి ఉండవచ్చు కానీ..మానసికంగా మనసున్న మనసున్న 'మహారాజు'. సేవే లక్ష్యంగా బ్రతుకుతున్న సగటు జీవి. మానవత్వం ఇంకా మంట కలిసిపోలేదు అనేందు ప్రత్యక్ష ఉదాహారణ. అతనే..షరీఫ్‌ చాచా..!
  130 కోట్ల జనాభా ఉన్న ఈ విశాల భారత దేశంలో విధి వక్రించి అభాగ్యులుగా మరణిస్తున్న వారెందరో.. అలా నిరాదరణకు గురైన ఎంతో మంది అనాథ శవాలకు ఆసరాగా నిలుస్తున్నారు ఈ 82 ఏళ్ల షరీఫ్‌ చాచా. గడిచిన 27 ఏళ్లలో 25,000 వేల మంది అభ్యాగులకు దహన సంస్కారాలు నిర్వహించి వారికి మరణంలోనూ గౌరవాన్ని ప్రసాదించారు. అంతటి గొప్ప మనసున్న చాచాని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన నిస్వార్థ సేవకు సముచిత గౌరవం కల్పించింది. 
కుమారుడి మరణంతో...
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ షరీఫ్‌ చాచా స్వస్థలం. పెద్దగా చదువుకోని చాచా సైకిల్‌ మెకానిక్‌గా స్థిరపడ్డారు. 28 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత చెలరేగిన మత ఘర్షణల్లో ఆయన పెద్ద కొడుకు మరణించాడు. కానీ, ఆ విషయం నెల తర్వాత గానీ కుటుంబ సభ్యులకు తెలియరాలేదు. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయి అనాథలా తన కుమారుని శవం రైలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసి షరీఫ్‌ చలించిపోయారు. తన కన్న కొడుకుకి పట్టిన గతి ఇంకెవరికీ రాకూడదని అప్పుడే సంకల్పం చేశారు. ఎక్కడ గుర్తు తెలియని మృతదేహాలు కనిపించినా సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అభ్యాగుల శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 25 వేల అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. 
షరీఫ్‌ ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్చురీలను సంప్రదిస్తారు. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత 72 గంటల్లో ఎవరూ శవాన్ని తీసుకోవడానికి రాకపోతే తనకు అప్పగించాలని చెబుతారు. చాచా చేస్తున్న సేవను గుర్తించిన వారు ఆయనకు సహకరిస్తు న్నారు. హిందూ, ముస్లీంతో నాకు సంబంధం లేదు. నా దృష్టిలో అందరూ మనుషులే అంటారు చాచా. ఆయన సేవల్ని గుర్తించిన బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు అమీర్‌ఖాన్‌ 2012లో తన సత్యమేవ జయతే కార్యక్రమానికి పిలిచి చాచాని ప్రపంచానికి పరిచయం చేశారు.  తాను చేస్తున్న మెకానిక్‌ పనితో ఇళ్లు గడవడమే కష్టంగా ఉన్నా..తన సేవకు మాత్రం ఏనాడూ స్వస్తి పలకలేదని చెబుతాడు. తాను సంపాదించే డబ్బులతో పాటు ఇరుగుపొరుగు ఇచ్చే స్వల్ప విరాళాలతో తన నిస్వార్థ సేవకు కొనసాగిస్తున్న చాచాకు సలాం చెబుదాం..!

No comments:

Post a Comment