రోగం పోక..కొత్త రోగం రాక..!

దవాఖానాల్లో పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్లు

హైదరాబాద్‌ : వచ్చిన రోగం నయమవుతుందని..ఆసుపత్రిలోకి అడుగుపెడితే..అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కొత్త రోగం అంటుకుంటుందట. ఇది చెప్పింది స్వయాన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరి. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రోగులు 48 గంటలకు పైగా చికిత్స పొందాల్సి వస్తే  వీరిలో సుమారు 10 శాతం మంది ఏదో ఒక కొత్త ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు. దవాఖానాల్లో బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగీ, ప్యారాసైట్స్‌..ఇలా వేర్వేరు రకాల సూక్ష్మక్రిములు దాడి చేస్తున్నాయని, ఇన్‌ఫెక్షన్లు పెద్దఎత్తున ప్రబలుతున్నాయని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ తాజా నివేదిక ధ్రువీకరించింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని దవాఖానాల్లో ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్న రోగులు 7 శాతం వరకు ఉండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంతకంటే మూడు శాతం అధికంగా ఉందని , వీటిల్లో రక్త,మూత్ర, శ్వాసకోశ, జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఆసుపత్రుల్లో అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్‌ను వినియోగించడం వల్ల సూక్ష్మక్రిములకు రోగ నిరోధకత పెరిగి మందులు పనిచేయని పరిస్థితి నెలకొంది. 'ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ, నివారణ'పై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ఇన్‌ఫెక్షన్ల నివారణకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు చేపట్టాల్సిన చర్యలను వివరించింది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం, భారతీయ వైద్య పరిశోధన మండలి, ఎయిమ్స్‌ సంయుక్తంగా ఇన్‌ఫెక్షన్ల నిరోధకతపై సమాచార సేకరణకు నడుం బిగించాయి. దేశవ్యాప్తంగా 35 ఆసుపత్రుల్లో కేంద్రాలను నెలకొల్పాయి. ఇవి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఇన్‌ఫెక్షన్‌ వ్యాధుల సమాచారాన్ని సేకరిస్తాయిన కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. 

Post a Comment

0 Comments