వైరల్‌ :ఎలుగుబంటి 'కథే' అతన్ని బ్రతికించింది..!

ముంబై (బంధార) : 'అడవిలో వెళ్తున్న ఇద్దరు స్నేహితులని ఓ ఎలుగు బంటి తరమడం..దాంతో ఒకరు చెట్టునెక్కి ప్రాణాలు రక్షించుకోవడం..మరొకరు అలా చెట్టునెక్కలేక కిందపడిపోయి చనిపోయినట్టు నటించడం.. దాంతో  ఆ ఎలుగు బంటి అతను చనిపోయాడని పొరబడి అక్కడ నుండి వెళ్లిపోవడం...' ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలోని  బంధార జిల్లాలో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పులి చేతిలో చావు అంచుల దాక వెళ్లిన ఓ వ్యక్తి చాకచక్యంగా  వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. దాని తాలూకు వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌ అయ్యింది. ఆ వీడియో ప్రకారం... ఊర్లోకి చొరబడ్డ ఓ పులిని గ్రామస్థులంతా వెంటబడి తరుముతున్నారు. అది భయంతో పరుగులు పెడుతూ సమీపంలోని పంట పొలాల్లోకి చేరింది. అంతలోనే అనూహ్యంగా వెనక్కి మళ్లి ఓ వ్యక్తి పై దాడికి యత్నించింది. అతన్ని కింద పడేసి... ఛాతీ బాగాన్ని నోటితో చీల్చాలని చూసింది. చచ్ఛాన్రా దేవుడోయ్‌..! అని భయంతో గుండెలు అదురుతున్నా ఆ వ్యక్తి మాత్రం ధైర్యం కోల్పోలేదు. అంతటి ప్రాణపాయ స్థితిలోనూ బుద్దికి పనిచెప్పాడు. ఊపిరి బిగపట్టి చచ్చినట్టు పడిఉన్నాడు. అప్పటికే గ్రామస్థుల అరుపులతో బెదిరిపోయిన పులి..నోటికి చిక్కిన 'ఆహారం' పోతే పోయిందిలే అనుకుంటూ అడవిలోకి పరుగులు పెట్టింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Post a Comment

0 Comments