యాసీడ్‌ అమ్మకాలు..షాకైన దీపిక..!

మనదేశంలో యాసీడ్‌ అమ్మడం..కొనడం చాలా సులభమని, ఇందుకు ఎటువంటి నిబంధనలు పాటించకుండానే యాసీడ్‌ సీసాలు దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె.  యాసిడ్‌ అమ్మే వ్యక్తి.. కొనుగోలు చేసే వ్యక్తి గుర్తింపుకార్డు చూడాలి, చిరునామా తీసుకోవాలి..ఆపై ఫలానా వ్యక్తి యాసిడ్‌ కొన్నాడనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. కానీ ఇవేవీ జరగడం లేదని విచారం వ్యక్తం చేసింది. యాసిడ్‌ దాడుల్ని అరికట్టేందుకు ఆమె తాజాగా మరో సరికొత్త ప్రయోగం చేశారు. దుకాణ యజమానులు విచ్చలవిడిగా యాసిడ్‌ అమ్ముతున్నారని, దీనికి ఓ పద్ధతి -ప్రక్రియ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసిడ్‌ సీసాలు కొనుగోలు చేయడం సులభమని, తన బృందం ద్వారా 24 యాసిడ్‌ సీసాలను కొన్నట్లు తెలిపారు. 
దీపిక టైటిల్‌ రోల్‌ పోషించిన సినిమా 'ఛపాక్‌'. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. జనవరి 10న విడుదలైన ఈచిత్రం మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమా నేపథ్యంలో దీపిక ఇటీవల యాసిడ్‌ దాడి బాధితుల పట్ల సమాజం ప్రవర్తిస్తున్న తీరును తెలుపుతూ ఇప్పటికే వీడియోను విడుదల చేశారు. ఇప్పడు మరో వీడియోను షేర్‌ చేశారు. అందులో దీపిక సిబ్బంది వ్యాపార వేత్త, విద్యార్థి, గృహిణి, ప్లంబర్‌.. ఇలా రకరకాల వేషాల్లో దుకాణాల వద్దకు వెళ్లి యాసిడ్‌ కొనుగోలు చేశారు. దీన్ని దీపిక తన కారులో కూర్చుని చూస్తున్నారు. దుకాణాల్లో ఎటువంటి గుర్తింపు కార్డు చూడకుండానే యాసిడ్‌ ఇచ్చారు. కొందరు మాత్రమే ఐడీలు అడిగారు. సుప్రీం కోర్టు నిబంధనలు పెట్టినప్పటికీ.. ఒక్క రోజులో 24 యాసిడ్‌ సీసాలు కొనగలిగామంటే నమ్మలేకపోతున్నామని దీపిక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యాసిడ్‌ కొనుగోలు, అమ్మకాన్ని నిలిపివేయాలని కోరారు. 

Post a Comment

0 Comments