సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ...నారా లోకేష్‌కు నోటీసులు జారీచేయాలంటూ ఫిర్యాదు..!

అమరావతి: టిడిపి శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. శాసనమండలిలో వాడీవేడీగా చర్చ కొనసాగుతున్న సమయంలో దానికి సంబంధించిన సన్నివేశాలను ఆయన తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వైయస్సార్‌సీపీ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండిలో వాడీవేడీగా చర్చ కొనసాగుతున్న సమయంలో నారా లోకేష్‌ తన స్థానం నుంచి లేచి నిల్చొని మరీ సమావేశాల తీరుతెన్నులను తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రకరించారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై రూల్‌ 71 కింద చర్చించడానికి టిడిపి పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంబంధించిన చర్చ అది. టిడిపి సభ్యుల వైఖరికి నిరసనగా, ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా శాసన మండలిలో మంత్రులు పోడియంలోకి దూసుకెళ్లిన సందర్భం అది. 
ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహా, ఆ పార్టీ సభ్యులు మండలి ఛైర్మన్‌ స్థానం వద్దకు దూసుకెళ్లి తమ నిరసనలను తెలియజేసిన దృశ్యాలను నారా లోకేష్‌ తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్‌, దీపక్‌రెడ్డి, తిరుమల నాయుడు వంటి సభ్యుల ప్రసంగాలు, వారు నిల్చొని మంత్రుల తీరును తప్పుపట్టడాన్ని మొబైల్‌ ఫోన్‌లలో బంధించినట్లు తెలుస్తోంది.
దీన్ని గమనించిన మంత్రులు, వైయస్సార్‌సీపీ సభ్యులు మండలిలోనే నారా లోకేష్‌ను తప్పుపట్టారు. ఈ విషయాన్ని ఛైర్మన్‌ మహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం షరీఫ్‌ మందలించడంతో నారా లోకేష్‌ తన ప్రయత్నాలను విరమించుకున్నారు. తన స్థానంలో కూర్చుండిపోయారు. అప్పటికప్పుడు ఈ వివాదం కాస్తా సద్దుమణిగినప్పటికీ ప్రభుత్వం దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తోంది. మండలి నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తోంది. చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయబోతోంది. 
అయితే వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనన మండలిలో గందరగోళ వాతావరణం నెలకొన్న సమయంలో తాత్కాలికంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ విషయం తెలిసిన తర్వాతే నారా లోకేష్‌ తన మొబైల్‌ ఫోన్‌లో సమావేశాలను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. సమావేశాల తీరును బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా అధికార పార్టీ ఉద్ధేశపూర్వకంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసిందని, అందుకే తాము మొబైల్‌ ఫోన్‌ ద్వారా చిత్రీకరించాల్సి వచ్చిందని నారా లోకేష్‌ చర్యలను టిడిపి సభ్యులు సమర్థిస్తున్నారు. 

Post a Comment

0 Comments