Saturday, January 18, 2020

పేరుకు..పెద్ద రహదారి...!ప్రయాణం..ఓ సవారీ..!!

నరకం చూపిస్తున్న ఖమ్మం - రాజమండ్రి రోడ్డు

పండగ వేళ పట్టణం నుంచి సొంత గ్రామాలకు సమయానికి వెళదామనుకున్న వారికి నిజంగా ఖమ్మం - రాజమండ్రి రహదారిలో నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక రోజు ముందే  బయలుదేరినా 8 గంటలు పట్టాల్సిన ప్రయాణం ఆ రహదారిపై 12 గంటలకు పైగా పడుతుంది. దీంతో తిరుగు ప్రయాణంలో ఆర్‌టిసి టికెట్‌ను రద్దు చేసుకొని ప్రైవేటు బస్సులు ఆశ్రయిస్తున్నారు. దీనికి కారణం రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడటమే. ఈ రహదారిపై ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం అంటే కొందరు భయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ రహదారులు బాగా దెబ్బతిన్నాయి. మెయింటెనెన్స్‌ పనులు నామమాత్రంగా ఉండటంతో ఇటీవల భారీ వర్షాలకు పెద్ద పెద్ద గోతులు పడి మారుమూల పల్లె దారి కంటే హీనంగా తయారయ్యింది. ముఖ్యంగా వైరా - సత్తుపల్లి  మధ్య దాదాపు పది కిలోమీటర్ల మేర  రోడ్డుమీద ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. మళ్లీ ఆంధ్రాలోని జంగారెడ్డి గూడెం నుండి రాజమండ్రి మధ్య ఇలాగే తయారైంది. కిలోమీటర్ల మేర రోడ్డు దారుణంగా మారడంతో బస్సులు బాగా నెమ్మదిగా వెళ్తే తప్ప క్షేమంగా గమ్యం చేరని పరిస్థితి నెలకొంది. ఏ మాత్రమూ వేగంగా వెళ్లినా అదుపుతప్పి బోల్తా కొట్టే ప్రమాదం ఉంది.  
ఈ రహదారిలో దాదాపు పది ప్రాంతాల్లో లారీలు బోల్తా పడ్డాయి. దీంతో నెమ్మది ప్రయాణం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లేందుకు 8 గంటల సమయం పడుతుండగా, ఖమ్మం మీదుగా 12 గంటల సమయం పడుతోంది. ఆర్‌టిసి బస్సుల్లో నాన్‌స్టాప్‌ సర్వీసులకు ఇదే రోడ్డు సూచించడంతో ఆ బస్సుల్లో వెళ్లివచ్చే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.  ఇటీవల సంక్రాంతి ప్రయాణాలు వారికి ప్రత్యక్ష నరకాన్ని చవిచూపాయి. రెండు వైపులా ఆర్‌టిసి బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నవారిలో కొందరు వెళ్లేప్పుడు దుస్థితి గ్రహించి టికెట్‌ రద్దు చేసుకుని విజయవాడ మీదుగా వచ్చే బస్సులను ఆశ్రయిస్తున్నారు. 
దృష్టి పెట్టకపోవడమే... కారణం..
రెండేళ్ల క్రితం వరకు ఇది రాష్ట్ర రహదారి. ఆ సమయంలో కూడా దీనిపై  దృష్టి పెట్టకపోవడంతో ఇది గోతులుగానే ఉండేది. కానీ అడపాదడపా చేపట్టే రెన్యూవల్స్‌తో కాస్త మెరుగుపరుస్తూ నెట్టుకొచ్చేవారు. రెండేళ్ల  క్రితం దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించారు. అంటే నేషనల్‌ హైవే విభాగం దీన్ని విస్తరించి మెరుగు చేయాల్సి  ఉంటుంది. ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలి. ఎన్నికల సమయం కావడంతో దాదాపు ఏడాదిన్నరగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ దీన్ని పెండింగ్‌లో ఉంచింది. జాతీయ రహదారిగా ప్రకటించినందున రాష్ట్ర అధికారులు దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా అసలు మరమ్మతులే లేకపోవడంతో అత్యంత దారుణంగా తయారైంది. దీంతో ఆ దారి గుండా వెళ్లే వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. 

No comments:

Post a Comment