Tuesday, January 21, 2020

రైతన్నకు శుభవార్త..!

రైతుబంధు నగదు రూ.5,100 కోట్లు విడుదల - రైతుల ఖాతాల్లో జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతున్నలకు శుభవార్త తెలిపింది. రైతు బంధు పథకానికి రూ.5,100  కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ సోమవారం పరిపాలనా అనుమతిచ్చింది. గత జూన్‌ - సెప్టెంబరు మధ్య ఖరీఫ్‌(వానాకాలం) సీజన్‌కు సంబంధించి రైతులకు ఇంకా దాదాపు రూ.1,600 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అవి ముందుగా రైతుల ఖాతాల్లో వేస్తే వీటిలో రబీ(యాసంగి)కి రూ.3,500 కోట్లే మిగులుతాయి. ఖరీఫ్‌ బకాయిలు ముందు ఇస్తారా ? లేక రబీకి తొలుత ఇస్తారా? అనేది నాలుగైదు రోజుల్లో తెలుస్తుంది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన 10 ఎకరాల్లో భూమి గల రైతులందరి ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున వ్యవసాయశాఖ జమచేసింది.  10 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు ఇంకా సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధానంలో తొలుత ఎకరం, తర్వాత  2 ఎకరాలు.. ఇలా పెంచుకుంటూ తక్కువ భూమి ఉన్నవారి ఖాతాలో ముందు జమ అనే విధానంలో వెళ్లాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ఈ పథకానికి  ఈ ఏడాది బడ్జెట్‌లో మొత్తం రూ.12,862.50 కోట్లు కేటాయించారు. ఖరీఫ్‌లో రూ.6,862.50 కోట్లు, ఇప్పుడు రూ.5,100 కోట్లు పోను మరో రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఉత్తర్వులో ప్రభుత్వం వివరించింది. రెవెన్యూ శాఖ నుంచి ఆన్‌లైన్‌లో రైతుల పట్టాదారు పాసు పుస్తకాల వివరాలన్నీ తీసుకొని సొమ్ము జమకు ఖజానా కార్యాలయానికి పంపుతామని వ్యవసాయశాఖ తెలిపింది. మొత్తం 57 లక్షల మంది వివరాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రబీ సీజన్‌ గత అక్టోబర్‌లో మొదలైంది. ఈ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 

No comments:

Post a Comment