తలారీ సిద్ధం...'ఉరి'..పైనే సస్పెన్షన్‌..!

ఢిల్లీ : ఫిబ్రవరి 1కి ఇంకా 24 గంటల సమయమే ఉంది. 'నిర్భయ'కేసుపై ఆ మృగాళ్లకు ఉరే సరి అని నినదించిన భరతమాత బిడ్డలు ఆఖరి.. క్షణాలను చూసేందుకు ఎదురుచూస్తున్న రోజు.  ఉరిశిక్ష  అమలుకు ఇంకా ఒక్క రోజు గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో శిక్షను అమలు పరిచేందుకు తలారీ పవన్‌ జల్లాద్‌ తీహార్‌ జైలుకు చేరినట్లు  జైలు అధికారులు తెలిపారు. జైలు ప్రాంగణంలో ఆయన కోసం ప్రత్యేక గది, వసతి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడో తరానికి చెందిన తలారి పవన్‌ జల్లాద్‌ జైలు ప్రాంగణంలోనే ఉండి ఉరితాడు సామర్థ్యంతో పాటు ఇతర విషయాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు. శుక్రవారం పవన్‌ డమ్మీ ఉరిని నిర్వహించనున్నారు. నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు పరిచేందుకు మీరట్‌కు చెందిన తలారి పవన్‌ జల్లాద్‌ సేవలను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు జైలు అధికారులు అభ్యర్థించిన విషయం తెలిసిందే. 
కొద్ది రోజుల ముందు నిర్భయ దోషులకు ఉరి వేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందుకోసం బక్సర్‌ నుంచి తాళ్లను తెప్పించినట్లు సమాచారం. కారాగార ప్రాంగణంలోని మూడో నెంబర్‌ జైలులో నిర్భయ దోషులు నలుగురిని ఏకకాలంలో ఉరి తీయ నున్నారు. అయితే తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఆపేందుకు నిర్భయ దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిర్భయ దోషి అక్షయ్‌కుమార్‌ వేసుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దానితో పాటు ఫిబ్రవరి 1న అమలు కానున్న ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా అతడు వేసిన మరో పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరో నిందితుడు వినయ్‌ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ ఇంకా పెండింగలోనే ఉంది. 

Post a Comment

0 Comments