నువ్వు..పల్లెటూరులో తిరిగినా..'రాజధాని'లో తెలుస్తుంది..!

మారుమూల ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు
హైదరాబాద్‌ : దేశంలో రోజురోజుకీ నేరాలు పెరుగుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, కుటుంబ సంబంధాల నేరాలు, కిడ్నాప్‌, చోరీలు, అత్యాచారాల కేసులు పోలీస్‌స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. ఈ ఘటనల్లో నేరం చేసిన వారు సులువుగా తప్పించుకునే మార్గలను ఎంచుకోవడం, పోలీసులు కేసు విషయంలో తీవ్రంగా శ్రమించడం పోలీస్‌శాఖకు ఇబ్బందిగా మారింది. అయితే..ఇక నుంచి ఆ నేరాలు చేసే వారు తప్పించుకునే అవకాశం లేదు..ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌శాఖ మరో అడుగు ముందుకేసి అత్యాధునిక పద్ధతిని వినియోగించుకుంటూ రంగం సిద్ధం చేస్తుంది..
ఎక్కడైనా నేరాల దర్యాప్తులో, నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగప డుతున్నాయి.  ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానం. ఇది రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే నిరూపితమైంది. ఇక్కడ జరుగుతున్న నేరాల్లో మూడొంతులకుపైగా సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగానే ఛేదించగలుగుతున్నారు. ఈ ఫలితాలను విశ్లేషించిన పోలీస్‌ శాఖ సీసీ కెమెరాల వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను నెలకొల్పాలనే నిర్ణయానికొచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసుశాఖ దీన్నో ఉద్యమంగా చేపట్టింది. ముఖ్యంగా రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటయ్యాయి. ఐదేళ్ల కాలంలో రాజధానిలో నేరాలు దాదాపు 15 శాతం తగ్గిపోవడానికి ప్రధాన కారణం సీసీ కెమెరాలేననేది పోలీస్‌శాఖ నమ్మకం.
 ఈ ప్రయోగం రాజధానిలో విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు మొదలైంది. పోలీస్‌ అధికారులు చొరవ చూపిన చోట ఈ ప్రక్రియ వేగంగా, లేనిచోట నెమ్మదిగా కొనసాగుతోంది. అలా కాకుండా హైదరాబాద్‌ తరహాలో, జిల్లాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయబోతున్నారు. పట్టణాల్లోని కాలనీలు, గ్రామాల్లోని ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటయ్యే కెమెరాలన్నింటినీ జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించే కసరత్తును వేగవంతం చేశారు. ''ఈ మొత్తం వ్యవస్థను హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానిస్తాం.  తద్వారా ఇక్కణ్నుంచే రాష్ట్రంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా చక్కదిద్దే వెసులుబాటూ ఉంటుంది.  అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి, ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం ఉంటుంది.'' అని  ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments