కాబూల్‌ :సోమవారం మధ్యాహ్నాం 1.10 గంటలకు ఆఫ్గాన్‌ రాజధాని కాబూల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో మంటలు చెలరేగి విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కూలిన విమానం అమెరికా సైన్యానికి చెందినదని తాలిబన్‌ గ్రూపు ప్రకటించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు తాలిబన్‌ గ్రూపు అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ..ఘాంజీ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదానికి తామే కారణమని పేర్కొన్నాడు. ఘటనాస్థలమైన దేహ్‌ యాక్‌ ప్రాంతం తాలిబన్ల ఆధీనంలో ఉన్నందున ఈ ఘటన గురించి వివరాలు సేకరించడం అధికారులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తాలిబన్‌ గ్రూపు ప్రకటన విడుదల చేసింది. అమెరికా సైనిక స్థావరానికి 10 కి.మీ దూరంలో విమానాన్ని కూల్చేశామని పేర్కొంది. 
కాగా అమెరికా సైనికాధికారులు మాత్రం తాలిబన్ల వ్యాఖ్యలు కొట్టిపడేస్తున్నప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాద ఘటనపై అమెరికా సైన్యం విచారణ జరుపుతోందని ఈ ఘటనలో తాలిబన్ల ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయం త్వరలోనే తేలుతుందని పేర్కొన్నారు. ఇక ప్రమాదానికి గురైందని ఆఫ్గనిస్తాన్‌ జాతీయ విమాన సంస్థ అరియానా ఆఫ్గాన్‌కు చెందిన పౌర విమానం అంటూ ప్రచారం  జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా సదరు విమానం ఆఘ్గనిస్థాన్‌ గగనతలంపై నిఘా నిర్వహించే అమెరికా సైన్యానికి చెందినదని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనకు తామే కారణమంటూ తాలిబన్లు ముందుకు రావడం గమనార్హం.  ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్‌ తరుచుగా రాకెట్‌ దాడులకు పాల్పడుతున్న విషయం విధితమే. 

Post a Comment

Previous Post Next Post