Thursday, January 16, 2020

మకుటం లేని మహారాజుకు బిసిసిఐ షాక్‌..!

కాంట్రాక్టు ఇవ్వకపోవడంపై సందేహాలు..?

15 ఏళ్లుగా.. వరుసగా భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర రాసుకున్న  పరుగుల వీరుడు. బ్యాట్‌ పట్టుకుంటే గ్రౌండ్‌ మొత్తం షాట్లతో దద్దరిల్లిపోయింది.  ఇండియా గెలుపును జనసంద్రం అంతా మనుసుకు అత్తుకున్న సందర్భాలు ఎన్నో. భారత క్రికెట్లో మకుటం లేని మహారాజు. అతడు చెప్పిందే వేదం. చేసిందే శాసనం. అరంగేట్రంలో రనౌటైన అతడు ఆపై అంచెలంచెలుగా ఎదిగాడు. సారధిగా ఎంపికయ్యాడు. పరుగుల వరద పారించాడు. అత్యుత్తమ మ్యాచ్‌ ఫినిషర్‌గా వెలుగు వెలిగాడు.
 ఈ క్రమంలో ఎన్నో రికార్డులు అతడి కైవసమయ్యాయి. సారథిగా ఎంపికైన కొత్తలోనే భారత్‌ను టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిపాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో అతడేం చెబితే అదే! అన్నట్టుగా ఉండేది పరిస్థితి. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అతడి అండ.యువీ విన్యాసాలతో 2011లో వన్డే ప్రపంచకప్‌ అందుకున్నాడు. ఆపై ఛాంపియన్స్‌ ట్రోఫీ సొంతమైంది. అలాంటి వ్యక్తికి 2020లో బిసిసిఐ కాంట్రాక్టు ఇవ్వకపోవడం సంచలనమే!.?
సుదీర్ఘ ఫార్మాట్‌కు 2014లోనే గుడ్‌బై చెప్పిన ధోనీ గతేడాది(2019) గ్రేడ్‌ - ఏలో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌ ముందు వరకు అతడిపై ఎన్నో సందేహాలు. మునుపటిలా ఆడలేకపోవడం సమస్యగా మారింది. అత్యుత్తమ మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరుతెచ్చుకున్న అతడే ఒత్తిడికి తట్టుకోలేక బంతులు తింటూ చేయాల్సిన రన్‌రేట్‌ పెంచుతూ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేవాడు. ఒకప్పటిలా హెలికాఫ్టర్‌ షాట్లు బాధలేకపోయాడు. బౌలర్లు అతడిని పరీక్షించడం మొదలుపెట్టారు. అపార అనుభవం, నాయకత్వ ప్రతిభ దృష్ట్యా సెలక్టర్లు అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అందులోనూ అతడు పెద్దగా రాణించిందేమీ లేదు. వికెట్ల వెనకాల అలెక్స్‌ కేరీ తర్వాతి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో జడేజా అలవోకగా సిక్సర్లు బాదుతుంటే బాగానే  ఇచ్చాడు. కానీ చివరి వరకు బంతులు తింటూ ఒత్తిడిలోకి జారుకున్నాడు. ఆఖర్లో రన్‌ అవుట్‌ అత్యుత్తమ ముగింపు ఇవ్వలేకపోయాడు. నిరాశగా వెనుదిరిగాడు. 
 నిజానికి ప్రపంచకప్‌లోనే మహీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వచ్చాయి. అలా కాకపోవడం కొందరికి ఆశ్చర్యం మరికొందరికి సంతోషం కలిగించింది. భవిష్యత్తుపై సందేహాలు మాత్రం వీడలేదు. వీరేంద్ర సేహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, సునీల్‌ గావస్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ వంటి మాజీ క్రికెటర్ల భవితవ్యం సెలక్టర్లు అతడితో మాట్లాడాలని బహిరంగంగా సూచించారు. ఇంతలోనే వెస్టిండీస్‌ సిరీస్‌ వచ్చేసింది. ధోనియే నిరవధిక విరామం తీసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తర్వాత సిరీస్‌లో రాణిస్తాడనుకుంటే అసలు ఎంపికే అవ్వలేదు. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు సంధించడంతో ' భారత క్రికెట్‌కు మహీ ఎంతో సేవ చేశాడు. అతనో గొప్ప ఆటగాడు. నిజానికి సెలక్షన్‌కు అతడే అందుబాటులో లేడు. విహారయాత్రకు వెళ్లాడు. అతడిని దాటి భారత క్రికెట్‌ను చూస్తున్నాం' అని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే కుండబద్దలు కొట్టారు. 
'ఐపీఎల్‌ ఆడతాను..జనవరి వరకు నన్నేమీ అడగొద్దు..' అని ధోనీ చెప్పేసరికి ఊహాగానాలు తొలగిపోయాయి. 'మహీ ఐపీఎల్‌ 2020 ఆడతాడు. అందులో ప్రదర్శనను బట్టే టీ20 ప్రపంచకప్‌ జట్టు పోటీలో ఉంటాడు. అనుభవం, ప్రదర్శన ఆధారంగానే ఎంపిక ఉంటుంది.' అని రవిశాస్త్రి చెప్పడంతో మరింత స్పష్టత వచ్చింది. 'బహుశా ధోనీ వన్డేలకు వీడ్కోలు పలకొచ్చు' అని ఆయనే చెప్పడంతో మళ్లీ సందిగ్ధం చోటు చేసుకుంది. యాధృచ్ఛికంగా గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ మహీకి కాంట్రాక్టు నిరాకరించింది. దీంతో మొత్తంగా ధోనీ క్రికెట్‌ జీవితం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి మరి..!


No comments:

Post a Comment