Monday, January 27, 2020

పేదరికంలో 'హాకీ'ని గెలిచింది..ఇప్పుడు 'పద్మశ్రీ'ని గెలుచుకుంది..!

ఢిల్లీ: ఆమెకు హాకీ అంటే ప్రాణం.. అందుకే ఆరేళ్లకే హాకీ స్టిక్‌ పట్టుకుంది.  14 ఏళ్లకు జాతీయ జట్టుకు ఎంపికైంది. కెప్టెన్‌గా జట్టుకు చరిత్రాత్మక విజయాలు అందించింది. భారత మహిళా హాకీ జట్టు ప్రస్థానంలో ఆమె కంటు ఒక మైలురాయిని ఏర్పరుచుకుంది. ఆమే భారత హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌. తాజాగా ఆమె ప్రతిభకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
పేదరికమైన జీవితం నుండి..

రాణిది హరియాణాలోని షాబాద్‌. తండ్రి రిక్షా నడిపేవాడు. షాబాద్‌ క్రీడాకారుల వేదిక. ముఖ్యంగా అక్కడి వాళ్లు హాకీ అంటే ప్రాణం పెట్టేవాళ్లు. హాకీ క్రీడకు గుర్తింపు ఉండటం, చుట్టుపక్కల వాళ్లంతా ఆడటం చూసి రాణి కూడా ఆటపై ఆసక్తి చూపేది. ఆమె ఆసక్తిని గమనించి తండ్రి ప్రోత్సహించాడు. ఆరేళ్లకే టౌన్‌ అకాడమీలో రాణీపేరును నమోదు చేయించాడు. తల్లిదండ్రులు మొదటి నుంచీ ప్రోత్సహించినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని ఎప్పుడూ వెంటాడేవి. ఓవైపు ఆటలో ప్రతిభ చూపుతున్నా హాకీ స్టిక్స్‌, బూట్లు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడింది. అయినా రాజీ పడలేదు. గో స్పోర్ట్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయంతో  ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్దేవ్‌ సింగ్‌ మార్గదర్శకత్వంలో రాణి రాటుదేలింది.
హరియాణాలో కాప్‌ పంచాయతీలు అక్కడి అమ్మాయిల ఎదుగుదలకు ఆటకంగా మారేవి. మహిళలు, బాలికలపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. ఆ ప్రభావం షాబాద్‌లోనూ ఉండేది. రాణిని అకాడమీలో చేర్పించినప్పుడు పంచాయతీ పెద్దలు అడ్డు చెప్పారు. ఆమె తల్లిదండ్రులను మందలించారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. తండ్రి సంపాదించే కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొన్తూ, ఆమె ఆటకు కొంతమొత్తం కేటాయించేవాడు. కోచ్‌ బల్దేవ్‌కు చెందిన హాకీ అకాడమీలో ప్రాక్టీస్‌ చేసేందుకు రోజూ రెండు కి.మీలు నడిచి వెళ్లేది. కొన్ని రోజులు తర్వాత తండ్రి సైకిల్‌ కొనిచ్చాడు. దానిపై ప్రాక్టీసుకు వెళ్లేది. మొదట్లో జాతీయ జట్టుకు ఆడుతున్నా ఆదాయం అంతంతే ఉండేది. దీంతో టోర్నీలకు మధ్య విరామం ఉన్నప్పుడు రైల్వేలో జూనియర్‌ క్లర్క్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. అన్ని అవరోధాలను దాటుకుంటూ ఆటలో మేటిగా నిలిచిన రాణి..పద్మశ్రీ పురస్కారాన్ని హాకీ జట్టు, అభిమానులు, కోచ్‌, సహాయక సిబ్బందితో పాటు తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నానని చెప్పింది. 


No comments:

Post a Comment