అమరాతిలోనే శాశ్వత పాలనా రాజధాని - జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌

అమరావతి: మూడు రాజధానుల ముచ్చట మూణ్నాళ్లేనని, రాజ్యాంగ పరిధిని అతిక్రమించి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాగించలేవని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 'శాశ్వత పరిపాలన రాజధాని అమరావతిలో మాత్రమే ఏర్పాటవుతుంది. అది బిజెపి- జనసేనలతోనే సాధ్యం. రాజధాని అమరావతి తరలించడం తాత్కాలికమే. పేపరులో మాత్రమే ఉంటుంది. 3 రాజధానులపై బిజెపి అగ్రనాయకత్వంతో  చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తాం' అని తెలిపారు.
విశాఖలో ఫ్యాక్షన్‌ సంస్కృతి తీసుకురావలని చూస్తున్నారని, అక్కడ స్థిరాస్థి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారని పవన్‌ ఆరోపించారు. 33 వేల ఎకరాలిచ్చిన రైతులు, మహిళలు లాఠీదెబ్బలు తిన్నారని, ఇది వైయస్సార్‌సీపీ నాశనానికి నాందని విమర్శించారు. పిచ్చిపిచ్చి విధానాలతో ప్రజల్లో  అంశాతి సృష్టించారన్నారు. ఈ పిచ్చితనం ఆపాలనే బిజెపితో కలిశామని అన్నారు. టిడిపికి బలం సరిపోవడం లేదు. విభజించే వైయస్సార్‌సీపీని ఎదుర్కొనేది బిజెపి-జనసేననే అని స్పష్టం చేశారు. ప్రజలను కన్నీళ్లు పెట్టించిన వారికి ఉసురు తగులుతుందని, వారి స్వార్థం కోసం విచ్ఛిన్నం చేసే విధానానికి ఎక్కడో చోట కట్టడి ఉండాలి అని సూచించారు. 'జనసేన టికెట్టుపై గెలుపొందిన రాపాక వరప్రసాద్‌ శాసనసభలో చేసిన ప్రసంగం జనసేన నిర్ణయాలకు విరుద్ధం. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి రాపాకపై చర్యలు తీసుకుంటాం' అని వెల్లడించారు. 
అనంతరం మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచి ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ సోమవారం రాత్రి రాజధాని గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 4 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాయపడిన మహిళలు, రైతులు, రైతు కూలీలను పరామర్శించడానికి ఎంత పొద్దయినా వెళతానని పవన్‌ పట్టుబట్టారు. సమావేశంలో ఉన్నప్పుడే పోలీసు బలగాలు చేరుకున్నాయి. చివరకు ఆయన సోమవారం రాత్రి పాదయాత్రను రద్దు చేసుకున్నారు. 


Post a Comment

Previous Post Next Post