అమ్మయ్య..నగరం..ఉపశమనం పొందింది..!

రెండురోజుల్లో సగానికి తగ్గిన కాలుష్యం

హైదరాబాద్‌ : సంక్రాంతికి మెజార్టీ సిటిజన్లు సొంతూరు బాటపట్టడంతో హైదరాబాద్‌ నగరం కాస్త ఉపశమనం పొందింది. రోడ్లెక్కె వాహనాలు తగ్గడంతో దుమ్ము, ధూళి కాలుష్యం కూడా సగానికి కంటే ఎక్కువుగానే తగ్గింది. ఈ సారి పండుగకి సుమారు 25 లక్షల మంది నగరం నుంచి సొంతూళ్లకు ప్రయాణం కావడంతో ప్రధాన రహదారులపై వాహనాల సంచారం అరకొరగానే కనిపించింది. గ్రేటర్‌ పరిధిలో నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతుండగా.. మంగళ, బుధవారాల్లో ఆ సంఖ్య 15 లక్షలకు మించకపోవడం గమనర్హాం. దీంతో దుమ్ము, దూళి కాలుష్యంతో పాటు మోటార్‌ వాహనాల నుంచి వెలువడే సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ తదితర కాలుష్య ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ రెండు రోజులు నగరం స్వచ్ఛ ఊపిరి పీల్చుకుంది.  
కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ప్రతి ఘనపు మీటర్‌ గాల్లో ధూళి కణాలు 60 మైక్రో గ్రాములకు మించి ఉండరాదు. కానీ సాధారణ రోజుల్లో పలు ప్రధాన రహదారులు, కూడళ్లలో 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర దూళి కాలుష్యం నమోదవుతోంది. భోగి, సంక్రాంతి పండగ సందర్భంగా మంగళ, బుధవారల్లో వాయు కాలుష్యం సగానికంటే తక్కువ నమోదవడం విశేషం. మోటారు వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు కూడా.. సగానికంటే తక్కువ మోతాదులో నమోదు కావడం విశేషం. నగరవాసులు సైతం పండగ వేళ ఇళ్లకే పరిమితం కావడంతో వాహనాల సంచారం గణనీయంగా తగ్గడం కాలుష్య ఉద్గారాలు పడిపోవడానికి మరో కారణంగా చెప్పవచ్చు. 
ప్రాంతాల వారీగా....
లంగర్‌ హౌజ్‌ -  సాధారణ రోజుల్లో - 117 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -71)
జూపార్క్‌ - సాధారణ రోజుల్లో -108 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -51) 
సైనిక్‌పురి - సాధారణ రోజుల్లో -106 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -46)
పంజాగుట్ట - సాధారణ రోజుల్లో -98 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -46)
ప్యారడైజ్‌ - సాధారణ రోజుల్లో -98 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -41)
నాచారం - సాధారణ రోజుల్లో -98 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -47)  
జీడిమెట్ల - సాధారణ రోజుల్లో -97 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -38) 
చార్మినార్‌ - సాధారణ రోజుల్లో -96 మైక్రో గ్రాములు (సంక్రాంతి రోజుల్లో -60)   

Post a Comment

0 Comments