Thursday, January 16, 2020

ప్రజలు విసుగుచెందారు..2024లో మాదే ప్రభుత్వం

ఒక్కటైన జనసేన-బిజెపి కూటమి

రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బిజెపితో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై బిజెపి పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చామని తెలిపారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ ¬టల్‌లో బిజెపి నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. బిజెపితో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. టిడిపి, వైయస్సార్‌సిపి ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడున్నది పాలెగాళ్ల రాజ్యం..
'ప్రజలు విసిగిపోయారు... ఇప్పుడున్నది పాలెగాళ్ల రాజ్యం... అంతకుముందు అవకతవకలు, అవినీతితో కూడిన పరిపాలన. ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. దాన్నే బిజెపి -జనసేన అందించబోతున్నాయి. ఈ కలయకకు అండగా నిలబడిన ప్రధాని మోడీ, అమిత్‌షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏపిలోనే కాకుండా అవసరమున్న ప్రతిచోటా మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా కలిసి పనిచేస్తామని వారికి హామీ ఇచ్చాం. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపితో కలిసే వెళ్తాం.'' అని పవన్‌ స్పష్టం చేశారు. 
రాజధాని అమరావతే....
''గతంలో రాజకీయంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇప్పుడు ఏకపక్షంగా తరలిస్తారని అనుకోను. కులతత్వం, కుటుంబపాలనతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తాం. అంతపెద్ద రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పా. 33 వేల ఎకరాలు ఎందుకని అడిగా. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయి. రైతులు రోడ్డున పడ్డారు. రాజధానిని తరలిస్తే రోడ్లపైకి రావడమే కాదు.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. అమరావతిని తరలిస్తే చూస్తూ కూర్చోము. తెగించే నాయకత్వంఉంది.'' అని అన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో టిడిపి బాధ్యత వహించాలి. అప్పట్లో వాళ్లు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకపోతే బాగుండేది. ఇప్పుడు ప్రత్యేక ¬దా గురించి 22 మంది ఎంపీలున్న వైయస్సార్‌సీపీనే అడగాలి అని పవన్‌ వ్యాఖ్యానించారు. 
సీఏఏ మంచిదే..
'అఖండ భారతంగా ఉన్న మనదేశం నుంచి పాకిస్థాన్‌ విడిపోయింది. పాక్‌ ఇస్లాం దేశంగా చెప్పుకుంటున్నాం. మన దేశాన్ని హిందూ దేశంగా చెప్పలేదు. బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాల్లో వెనుకబడిన వర్గాలు, దళితులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు ఇబ్బందులు పడకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడి ముస్లింలకు పౌరసత్వం రద్దు చేస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం.. మనదేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు..' అని తెలిపారు. 

No comments:

Post a Comment