Monday, January 27, 2020

బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మృతి.. 2012లోనే చెప్పిన నెటిజన్‌..!

అమెరికా: బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయింట్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారు. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో కోబ్‌ బ్రయింట్‌, ఆయన కుమార్తె (13) జియానాతో సహా 9 మంది మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సికోర్సికీ ఎస్‌ 76 హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఉన్న ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు బయలుదేరిన హెలికాఫ్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కొండను ఢీకొట్టి కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు. ప్రమాదం మారుమూల ప్రాతంలో జరగడం, ప్రమాద తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మృతదేహాలను వెలికితీయడానికి రోజుల సమయం పట్టే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 
ఇది ఇలా ఉండగా.. కోబ్‌ మరణవార్తను ఓ నెటిజన్‌ 2012 సంవత్సరంలోనే ఊహించాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ట్వీట్‌ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'నోసో' అనే పేరుతో ఓ ట్విటర్‌ యూజర్‌.. బాస్కెట్‌ బాల్‌ దిగ్గజం హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్‌ 14న ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన అతడి ఫాలోవర్లు నోసోపై మండిపడ్డారు. మరోవైపు ఇది తప్పుడు ట్వీట్‌ అని, అందులో తేదీ మార్చి ఇలా ప్రచారం చేస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు.  ఏదేమైనా ఆ నెటిజన్‌ చెప్పినట్లుగానే కోబ్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించడం గమనార్హం. అయితే సోమవారం ఆ నెటిజన్‌ ఏడేళ్ల నాటి తన ట్వీట్‌కు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. 
ప్రముఖుల సంతాపం..
కోబ్‌ బ్రయింట్‌ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు ఒబామా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. బాస్కెట్‌ బాల్‌ చరిత్రలో తనకంటూ బ్రయింట్‌ ఎన్నో రికార్డులు సృష్టించుకున్నాడు. ఏకంగా అయిదు సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాకుండా రెండు సార్లు ఒలింపిక్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు(2008,2012). రెండు దశాబ్ధాలుగా బాస్కెట్‌బాల్‌లో మెరిసిన ఈ అమెరికా ప్లేయర్‌ 2016లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

No comments:

Post a Comment