కిల్లర్‌ శ్రీనివాస్‌నూ చంపేయండి!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' హత్యకేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. అంతేకాకుండా ఇదే తరహా ఘటనలకు పాల్పడిన వారందర్నీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఇటీవల ముగ్గురు బాలికలను కర్కశంగా హత్యచేసిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌నూ చంపేయాలని ఆ గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీనివాస్‌ను శిక్షించే విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పలువురు గ్రామ పెద్దలను అరెస్టు చేసి భువనిగిరి జోన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
ఈ ఏడాది ఏప్రిల్‌ 25న బొమ్మలరామారంలోని పాఠశాల నుంచి హాజీపూర్‌కు తిరిగి వెళ్తుండగా శ్రావణి(16) అదృశ్యమైంది. అదే రోజు రాత్రి ఆమె తల్లిదండ్రులు బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన పోలీసులు మరుసటి రోజు ఏప్రిల్‌ 26న శ్రీనివాస్‌రెడ్డి బావిలో శ్రావణి మృతదేహాన్ని కనుగొన్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా..విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి.
దీంతో ఆగ్రహానికి గురైన హాజీపూర్‌ స్థానికులు శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని తగలపెట్టారు. అదే గ్రామానికి చెందిన తిప్పరబోయిన మనీషా(20) ఇంటర్‌ చదువుతోంది. ఈ అమ్మాయి ఈ ఏడాది మార్చి 9న అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శ్రావణి హత్యనంతరం పోలీసులు తమదైన శైలిలో శ్రీనివాసరెడ్డిని విచారిస్తూ మార్చిలో అదృశ్యమైన మనీషాను తానే అత్యాచారం చేసి హత్య చేశానని ఒప్పుకున్నారు. దీంతో పాటు 2015 ఏప్రిల్‌ 22న అదృశ్యమైన మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన(11) నూ తానే హత్య చేశానని అంగీకరించడంతో యావత్‌ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముక్కు పచ్చలారని బాలికలను అత్యాచారం చేసి హత్య చేయడంతో నిందితుడిని కఠినంగాశిక్షించాలని ఆ రెండు గ్రామాల ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. అనంతరం శ్రీనివాస్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌ నిమిత్తం వరంగల్‌ జైలుకు తరలించారు. ప్రస్తుతం రోజువారీ  విచారణ సాగుతుండటంతో అతన్ని నల్గొండ జిల్లా కేంద్రంలోని జైలులో ఉంచారు.

Post a Comment

Previous Post Next Post