ఆత్మీయ సమావేశం అదిరింది పో..!

సీఎం కేసీఆర్‌ ఆర్‌టిసి కార్మికులపై వరాల జల్లు

కొద్ది రోజుల ముందు ఆర్‌టిసి కార్మికులు సమ్మెలో ఉంటూ తమ ఉద్యోగాల కోసం బిక్కుబిక్కుమంటూ రోజులు గడిపారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారో..వెంటనే ఆర్‌టిసి కార్మికులకు ప్రాణాలు కుదుట పడిన పరిస్థితి నెలకొంది. వెంటనే డ్యూటీల్లో చేరారు. తదనంతరం ఆదివారం ఆర్‌టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్‌టిసి కార్మికులపై కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ  పకటన కూడా విడుదల చేసింది. ఆర్‌టిసిలో ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఏ ఒక్క రూటులోనూ ప్రైవేటు బస్సులను అనుమతి ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుండి ఏటా బడ్జెట్‌లో ఆర్‌టిసికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లోనూ ఆర్‌టీసీ లాభాల బాట పట్టాలని, ఏటా వెయ్యి కోట్ల లాభం రావాలని కోరారు. ప్రతి కార్మికుడు ఏడాదికి రూ.లక్ష బోసస్‌ అందుకునే స్థితికి రావాలని  ఆకాంక్షించారు. కార్మికులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన కేసీఆర్‌ తర్వాత రెండు గంటల పాటు వారితో సమావేశమయ్యారు. ఆర్‌టిసి కార్మికులకు సంబంధించిన ప్రతి అంశంపైనా స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్‌టిసి ఎండీ సునీల్‌ శర్మ, ఈడీలు ఆర్‌ఎంలు, డీవీఎంలు కంట్రోలర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 
52 రోజుల వేతనం  ఇస్తాం..
కార్మికులకు 52 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని సీఎం ప్రకటించారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో పాటు సెప్టెంబర్‌ వేతనం సోమవారమే చెల్లించనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు కార్మికుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లు పొడిగించినట్లు స్పష్టం చేశారు.
హామీల వరాలివే....
 • ఆర్‌టిసిలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి..అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి.యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే..ఒకే కుటుంబంలా వ్యవహరించాలి.
 • ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌ యథావిధిగా ఇస్తాం.
 • సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.
 • సంపూర్ణ టికెట్‌ బాధ్యత ప్రయాణికుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై  చర్యలు తీసుకోం.
 • కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప. ఉద్యోగం నుంచి తొలగించొద్దు.
 • మహిళా ఉద్యోగులకు రాత్రిపూట విధులు వేయొద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.
 • ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్‌ చేంజ్‌ రూమ్స్‌, లంచ్‌రూమ్స్‌ ఏర్పాటు.
 • మహిళా ఉద్య్గోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ మంజూరు చేస్తాం.
 • మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్‌ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫాం వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రెస్‌ వద్దంటే వారికి వేరే రంగు యూనిఫాం వేసుకునే అవకాశం కల్పిస్తాం.
 • మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేస్తాం.
 • రెండేళ్ల పాటు ఆర్‌టిసిలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు నిర్వహించం.
 • ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు
 • ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్‌టిసిలో హెల్త్‌ సర్వీసులు. కేవలం హైదరాబాద్‌లోనూ కాకుండా అవసరమైతే ఇతర ప్రాంతాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు  అందేలా చర్యలు 
 • ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ. మందుల కోసం బయటకు తిప్పవద్దని ఆదేశం.
 • ఆర్‌టిసి ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సుపాసులు. పిల్లలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సౌకర్యం వర్తింపు.
 • ఉద్యోగుల పీఎఫ్‌ బకాయిలు, సీసీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
 • ఆర్‌టిసిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేస్తాం.
 • కార్మికుల గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన చేస్తాం.
 • పార్సిల్‌ సర్వీసులను ప్రారంభిస్తాం.


Post a Comment

0 Comments