Saturday, December 7, 2019

''వారి చావుకు మీరే కారణం అంటే.. నాకు బాధ కలిగేది''

వరంగల్‌ యాసిడ్‌ దాడి బాధితురాలు ప్రణీత

మహిళలపై అత్యాచారాలకు, దాడులకు పాల్పడిన వారిపై సామూహిక హింస కాకుండా, చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించడమే పరిష్కారమని వరంగల్‌ యాసిడ్‌ దాడి బాధితురాలు టి. ప్రణీత అన్నారు. తమపై యాసిడ్‌ దాడి చేసిన ముగ్గుర్ని నిందితుల్ని 2008లో ఎన్‌కౌంటర్‌ చేసిననా కూడా.. ఇప్పటికీ న్యాయం జరిగిందన్న భావన తనకు కలగడం లేదని ప్రణీత తెలిపారు. 
'హఫింగ్టన్‌ పోస్ట్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత మాట్లాడుతూ మహిళలపై దాడులు జరగకుండా చూడటమే వారికి చేసే సరైన న్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు. యాసిడ్‌ దాటిలో ప్రణీత ప్రస్తుతం ఆమెరికాలోని డెన్వర్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌ శివార్లలో దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితుల్ని శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేయడానికి రెండ్రోజుల ముందు ప్రణీత ఇంటర్వ్యూ ఇచ్చారు.
నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో..
అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌ తనను ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉందన్నారు. ''నేనొక సాదాసీదా కాలేజీ విద్యార్థిని. క్లాసులకు వెళ్లి స్నేహితురాలు స్వప్నికతో కలిసి స్కూటర్‌పై తిరిగొస్తుండగా మాపై యాసిడ్‌ దాడి జరిగింది. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడే ముగ్గురు నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయం తెలిసింది.వారి చావులకు మీరు కారణమయ్యారని ఎవరైనా అంటే నేనేం తప్పు చేశానన్న బాధ కలిగేది. ఎన్‌కౌంటర్‌ మరణాలు మీలో ఆత్మస్టైర్యాన్ని పెంచాయా? అన్న ప్రశ్న నన్ను అడగొద్దు. ఎన్‌కౌంటర్‌ గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. ఆ మాట వింటే నాకు భయం వేస్తుంది.'' అని వివరించారు.
ఇప్పటికీ భయం వెంటాడుతూనే...
యాసిడ్‌ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ వల్ల న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ''అలాంటి చర్యల వల్ల ఏ న్యాయమూ జరగలేదు. నా  ముఖం, చర్మం సాధారణ స్థితికి వచ్చినప్పుడు, నేను మామూలు జీవితం గడిపినప్పడు మాత్రమే నాకు న్యాయం జరిగినట్లు. వాళ్లు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినా..నేను మాత్రం ఆ సంఘటన తర్వాత ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నా. నా చర్మానికి మొత్తం 14 సర్జరీలు చేశారు. కొద్ది రోజుల్లోనే జీవితం పూర్తిగా మారిపోయింది.ఇప్పటికీ నాటి సంఘటన తాలూకూ భయాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఫొటో తీసుకున్నా..అద్దం ముందు నిలబడినా.. నాటి సంఘటన గుర్తుకొస్తుంది. పరీక్షల్లో 82 శాతం మార్కులతో పాసయ్యా. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. అప్పటికీ నా జీవితం సాధారణ స్థితికి రాలేదు. నేనొక విదేశీ బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లాల్సి వస్తే 'మీరు శారీరకంగా ఫిట్‌గానే ఉన్నారా?' అని టీం లీడర్‌ అడిగితే..ఆయనతో నేను గొడవపడ్డా.''అని తెలిపారు. హైదరాబాద్‌ శివార్లలో టోల్‌ప్లాజా వద్దే నిలబడాలని చెల్లెలు చెప్పిన మాటను దిశ విని ఉంటే ఆమెకు ఎవరైనా సాయం చేసి ఉండేవారని ప్రణీత అభిప్రాయపడ్డారు. 

No comments:

Post a Comment