Wednesday, December 4, 2019

ఈవిఎంలతో ఓట్ల మాయాజాలం..మనకు తీరని నష్టం..!

బహుజన్‌ క్రాంతి మోర్చా జాతీయ కన్వీనర్‌ వామన్‌ మెశ్రాయ్‌ 

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈవిఎంల తొలగింపుతోనే మనకు సాధికారత లభ్యమని బహుజన్‌  క్రాంతి మోర్చా జాతీయ కన్వీనర్‌ వామన్‌మెశ్రాయ్‌ అన్నారు. బుధవారం స్థానిక కెమిస్టు అండ్‌ డ్రగ్గిస్ట్‌ భవనంలో లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బానోత్‌ భద్రునాయక్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు గొడ్డలి వేటులా ఈవిఎంలు దాపురించాయని, ఈ ఈవిఎంల్లో మనకు సాధికారత లభించకుండా ఓట్ల మాయాజాలం ఉందని విమర్శించారు. మనం ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటే వారు ఎన్నిక కావడం లేదని, మనం వ్యతిరేకించిన అభ్యర్థిలే విజయాలు సాధిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఒక అభ్యర్థికి ఈవిఎంలో ఒక ఓటు పడలేదని వీవీ ప్యాడ్ల స్లిప్పులు లెక్కిస్తే అతడికి 294 ఓట్లు పడ్డ విషయాన్ని  గుర్తు చేశారు.  
       అందుకే బహుజన్‌ క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ఈవిఎంలను తొలగించి, బ్యాలెట్లను తీసుకొని రావాలని డిమాండ్‌ చేస్తూ కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు మహా పరివర్తన యాత్రను తలపెట్టామన్నారు. ఈ యాత్ర ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో  తిరిగి తెలంగాణలో ప్రవేశించిందన్నారు. యాత్రతోపాటు పలు కులాలు, తెగలుగా మొత్తం 6 వేల తరగతులుగా చల్లబడ్డ బహుజనుల సంఘటిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈవిఎంల తొలగింపు బ్యాలెట్ల వ్యవస్థ ఏర్పాటుతోనే మన అభ్యర్థులు  గెలుస్తారని, తద్వారా బహుజనుల సాధికారత సిద్ధిస్తుందని ఆకాంక్షిం చారు. భవిష్యత్తులో  దీనికోసం మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని, అవసరమైతే  భారత్‌బంద్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ సభలో ఓబిసి జాతీయ అధ్యక్షులు వికాస్‌పాటిల్‌, బహుజన ముక్తి పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్‌, లంబాడీ హక్కుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శాంతి ప్రసంగించారు. కార్యక్రమంలో మెశ్రామ్‌ సతీమణి నిషా, పలు పార్టీల, కుల, ప్రజా సంఘాల నాయకులు వై.వినయ్‌కుమార్‌,  డాక్టర్‌ కృష్ణారావు, లక్ష్మణ్‌రావు, వెంకట రమణ, నాగభూషణం, నసీమా, సంజీవరావు,వీరభద్రం, వీరన్న, శ్రీనివాస్‌నాయక్‌, లక్ష్మణ్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment