Tuesday, December 10, 2019

సెల్యూట్‌.. ఖమ్మం పోలీసు సార్లూ..!

ప్రాణాలు కాపాడిన త్రీటౌన్‌ బ్లూకోల్డ్స్‌ టీమ్‌


ఖమ్మం పోలీసులు ఏ క్షణమైనా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నారనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన కొత్తపల్లి మల్లయ్య అనే వ్యక్తి ఇంటిలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన మల్లయ్య ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమై చివరి సారిగా తన భార్యకు ఫోన్‌ చేశాడు.''నేను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నాను.'' అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమైన అతని భార్య డయల్‌ '100'కు సమాచారం ఇచ్చింది. డయల్‌ 100 ద్వారా సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్‌ సిఐ శ్రీధర్‌ ఆ వ్యక్తి ఉన్న లోకేషన్‌ సేకరించి సారధి నగర్‌ రైల్వే ట్రాక్‌ వైపు ఉన్నట్లు గ్రహించి బ్లూకోల్డ్‌  బృందాలను అప్రమత్తం చేశారు. బ్లూకోల్డ్స్‌ కానిస్టేబుల్‌ పాషా లోకేషన్‌ మ్యాపింగ్‌ ద్వారా కిలోమీటర్‌ దూరంలో ఆ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకునేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో రైలు రాకపోవడం.. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కాపాడారు. రైలు కింద పడి చచ్చిపోతానని కొద్దిసేపు పెనుగులాడిన ఆ వ్యక్తిని నచ్చచెప్పి ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కౌన్సిలింగ్‌ చేసి పంపించారు. నిమిషం ఆలస్యం అయినా ఆత్మహత్య చేసుకునేవాడని బ్లూకోల్డ్స్‌ కానిస్టేబుల్‌ పాషా తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుకమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్‌, అడిషనల్‌ డిసిపి మురళీధర్‌, ఏసీపీ గణేష్‌, సీఐ శ్రీధర్‌ సిబ్బందిని అభినందించారు. 

No comments:

Post a Comment