శంషాబాద్‌ సమీపంలో అత్యాచారానికి, హత్యకు గురైన 'దిశ' కేసులో నిందితుల కిరాతకాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమెను హతమార్చిన తర్వాతే పెట్రోలు పోసి తగలబెట్టినట్టు పోలీసులు ఇప్పటి వరకు చెబుతున్నారు. కాని ఆమెను బతికుండగానే సజీవదహనం చేసినట్లు కీలక నిందితుడు ఆరిఫ్‌ చర్లపల్లి జైల్లోని కొందరు కిందిస్థాయి సిబ్బందికి చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులోని నలుగురు నిందితులను హైదరాబాద్‌ చర్లపల్లి జైలులో ప్రత్యే నిఘాలో ఉంచారు. వారితో కొంత మంది జవాన్లు మాట  కలిపినప్పుడు ఆరిఫ్‌ జంకుగొంకు లేకుండా పలు విషయాలు బయటపెట్టినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు మీడియాకు వెల్లడించాయి. నేరం జరిగిన రోజున ఆరిఫ్‌ సహా మరో ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకుని సమీప ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే రక్షించమంటూ ఆమె పెద్దగా కేకలు వేసింది. అవి ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో అప్పటికే తాగిన మత్తులో ఉన్న చెన్నకేశవులు వెంటనే జేబులోని సీసా తీసి అందులోని మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. అప్పటికే భయంతో ఆందోళనతో ఉన్న ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే నలుగురు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారు. తర్వాత ఆమెను లారీ మీదకు ఎక్కించారు. అక్కడ మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వైపు మద్యం తాగించడం, మరో వైపు పాశవికంగా అత్యాచారానికి గురవ్వడంతో ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె చనిపోయినట్లుగా భావించి చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకెళ్లి బతికి ఉండగానే పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. 

Post a Comment

Previous Post Next Post