Tuesday, December 10, 2019

ఉన్నావ్‌ నేరస్థులను కఠినంగా శిక్షించాలి: ఐద్వా

ఉన్నావ్‌ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఖమ్మం పట్టణంలోని మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక పెవిలియన్‌ గ్రౌండ్‌ నందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బండి పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి మాట్లాడుతూ రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుపిలో ఉన్నావ్‌లో యువతిపై జరిగిన అత్యాచారం తర్వాత అతి దారుణమైన హత్య దేశ ప్రజలను కలిచివేసిందని అన్నారు. ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ అతని అనుచరులు దాడి చేసి కాల్చి చంపినా కూడా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం మహిళలంటే వారికున్న చిన్నచూపు, నిర్లక్ష్యం తెలియజేస్తుందని అన్నారు. మంగళవారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాజ్యాన్ని కాపాడాలని, అధికరణం 19 ప్రకారం ప్రతిమనిషి జీవించే హక్కును ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. మహిళలపై దాడులను, హింసను అరికట్టే విధంగా నేరస్థులను కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మెరుగు రమణ, మెహరున్నీసా బేగం, పి.సులోచన, బేబి, పి.రమ్య, బాగం అజిత, బెల్లం లక్ష్మి, గాయత్రి, ఫరీద, అమరావతి, మంగ, వెంకటమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment