Tuesday, December 3, 2019

ఉసురు తీసిని వారిని బాగా మేపి, విశ్రాంతిస్తున్నారా?

'దిశ' ఘటనపై కట్టలు తెంచుకున్న ఆక్రోశం, ఆవేదనదద్ధరిల్లిన జంతర్‌మంతర్‌-దేశవ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్‌ శివారులో హత్యాచారానికి గురైన 'దిశ (ప్రియాంకరెడ్డి)' కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోమవారమూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో  నిరసనలు మిన్నంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కోలకత్తా, బెంగుళూర్‌లో మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మహిళలు ఢిల్లీలో ఆందోళన చేశారు. దేశరాజధాని లో జంతర్‌మంతర్‌ వద్ద మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు ఢిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్‌ సోమవారం ప్రకటించారు.


ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహిళలు సోమవారం నిరసన తెలిపారు. తలకు నల్ల రిబ్బన్లు కట్టుకొని 70 మంది 'మాకు న్యాయం కావాలి' అత్యాచారానికి పాల్పడ్డవారిని ఉరితీయాలి' అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. 'ఓ రాజకీయ నాయకురాలిగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టలేదు. సమాజంలో జరుగుతున్న ఘటనలపై కలత చెందిన పౌర సమాజం సభ్యురాలిగా మాత్రమే చేపట్టాను. మహిళలకు రక్షణ లేదన్న విషయంమై చర్చించడానికి మనకు మరో నిర్భయ అవసరం ఎందుకు? అని ఆందోళనకు నేతృత్వం వహించిన కాంగ్రెస్‌ నాయకురాలు అమృతా ధవన్‌ చెప్పారు. న్యాయవ్యవస్థ త్వరగా న్యాయం చేయాలని కోరారు. ''నిర్భయ కేసుల్లో నిందితులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. చక్కగా తింటున్నారు. విశ్రమిస్తున్నారు. కానీ, బాధిత కుటుంబాల పరిస్థితి ఏమిటి?'' అని ఆమె ప్రశ్నించారు. 'మాకు న్యాయం కావాలి' మీ ఉసురు తీసిన హంతకులు ఇప్పటికీ జీవించి ఉన్నందుకు సిగ్గు పడుతున్నాం..'అంటూ నినాదాలు చేశౄరు. ప్రధాని మోడీ మౌనం వీడి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం హన్స్‌రాజ్‌ కళాశాలకు చెందిన అదితిపురోహిత్‌ అనే విద్యార్థి  ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. 

సీపీఎం పొలిటిబ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలా, కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి, విద్యార్థి సంఘాల ప్రతినిధులూ జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన లు చేపట్టారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కత్తాలోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు వర్సిటీ ప్రాంగణం నుంచి భారీ ర్యాలీచేపట్టారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహిలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు. జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు వర్శిటీ ప్రాంగణం వెలుపల మానవహారంగా నిలబడి 'దిశ' హత్యాచారాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కోల్‌కత్తా లో దసరా ఉత్సహాలను ఘనంగా నిర్వహించే దుర్గా పూజ కమిటీలు కొన్ని మహిళల కోసం ప్రత్యేక సహాయక నెంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. కాళీఘాట్‌ ప్రాంతానికి చెందిన ఓ కమిటీ సోమవారం తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆరు మొబైల్‌ నెంబర్లను ఉంచింది. ఆపదలో ఉన్న మహిళలకు సహకరిస్తామని పేర్కొంది. దేశంలో అత్యాచార ఘటనలను నిరసిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతిమాలివాల్‌ మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు. 


No comments:

Post a Comment