తల్లిదండ్రుల కోసం...పగలు ఆడ..రాత్రి మగ వేషం

''కూటి కోసం కోటి విద్యలు''..అన్న సామెత రీతిగా  తమిళనాడులోని మధురైలోని ఓ వ్యక్తి ఆరు నెలలుగా ఆడవేషం ధరించి ఇళ్లలో పనులు చేస్తూ పొట్టనింపుకుంటున్నాడు. ప్రస్తుతం సోషల్‌మీడియా ద్వారా ఈ  విషయం బయటకు వచ్చింది. ఇతని స్వగ్రామం శివగంగై జిల్లా మానామదురై. వయసు సుమారు 40 ఉంటుంది. తన ఊరిలో ఇతను లుంగీ, షర్టు ధరిస్తాడు. ప్రతిరోజూ ఊరి నుంచి మధురైకు వచ్చి రాజర్‌రోడ్డు తెప్పకుళం ప్రాంతంలో ఒక మరుగైన ప్రదేశం చేరుకుంటాడు.అక్కడ లుంగీ, షర్టు విప్పేసి చీర, జాకెట్‌, తలకు విగ్‌ ధరించి ఆడవేషంలో బయటికి వస్తాడు. ఆ ప్రాంతంలోని మూడు ఇళ్లకు వెళ్లి పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం  చేయడం వంటి పనులు చేసి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి తలపై విగ్‌ తొలగించి లుంగీ, షర్టుతో ఊరికి బయలుదేరుతాడు.
అసలు పేరు రాజా.. వేషంలో రాజాత్తి
అతను మగాడిగా వెళ్లి దుస్తులు మార్చుకుని ఆడదానిలా రావడాన్ని ఆ ప్రాంతానికి చెందిన కొందరు గమనించారు. దీంతో అతన్ని పట్టుకొని విచారణ జరిపారు. అందులో అతని అసలైన పేరు రాజాగా తెలిసింది. తాను పనిచేసే ఇళ్లలో తనపేరు రాజాత్తిగా చెప్పుకున్నట్లు తెలిపాడు. మానామదురైలో తనకు ఎలాంటి పని దొరకలేదని, వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకునేందుకు గత్యంతరం లేక ఆడవేషం వేసినట్లు తెలిపాడు. ఆరు నెలల క్రితం పనులు కోసం మదురైకి వచ్చానన్నాడు.
మూడు ఇళ్లల్లో పనులు..
తనను మహిళగా భావించి మూడు ఇళ్లలో పనులు ఇచ్చారని, అక్కడ ఇంటి పనులు చేసి మళ్లీ సాయంత్రం ఇంటికి వెళతానన్నాడు. ఈ విధంగా వచ్చే ఆదాయంతో వృద్ధాప్య తల్లిదండ్రులను కాపాడుతున్నానని తెలిపాడు. తాను వివాహం చేసుకోలేదని, కొందరు తాను మహిళా వేషంలో మోసగిస్తున్నట్లు భావించవచ్చని, అయితే తల్లిదండ్రులను చూసుకోవడానికి తనకు మరో మార్గం కనిపించలేదని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ఇళ్లల్లో ఇంత వరకూ ఎవరూ అనుమానించలేదని, తన మాటలు, నడవడిక మహిళల రీతిలో ఉండేలా చూసుకుంటానన్నారు. తాను పనులు చేస్తున్న చోట క్రమశిక్షణతోనే మెలిగానని తెలిపాడు. ఏదైనా ఒక రోజు యజమానులను ఈ విషయం తెలిసినా.. తన పరిస్థితి గమనించి పనిలో పెట్టుకుంటారని ఆశతో పనిచేస్తున్నానని చెప్పాడు.


Post a Comment

0 Comments