మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయిస్తారా..?

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని 

మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించడం సరికాదని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశ భద్రతకు ప్రమాదమని అన్నారు. సరిహద్దు రాష్ట్రాలలో అభద్రతా భావం వలన ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంట్‌లో చర్చల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన సవరణలను పట్టించుకోకుండా బిల్లును ఆమోదించడం నియంతృత్వ ధోరణితో సాగిందన్నారు. ముస్లీం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు తెచ్చారని, బిల్లు నుండి మతాల పేర్లు  తొలగించాలన్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లే కాక సరిహద్దు  దేశాలన్నింటిని చేర్చాలని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇదివరకే జిఎస్టీ తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ బిల్లు కొన్ని వర్గాలకు మాత్రమే మద్దతుగా ఉన్నదని, ఇది ప్రజా వ్యతిరేకమైన బిల్లు అని అన్నారు. మోడీ, అమిత్‌షాలు తమ నిర్ణయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
 ఒకవైపు దేశంలో ఆర్థిక మాంధ్యం పెరిగి, ధరలు ఆకాశాన్ని అందుకుంటుంటే, నిరుద్యోగం పెరుగుతుంటే, మరొకవైపున ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్‌కు ట్టుపెడుతూ, వారికి రాయితీలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమస్యలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వివాదస్పద సమస్యలను కేంద్ర ప్రభుత్వం ముందు తెస్తుందని అన్నారు. ఈ బిల్లును వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. బావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన బిజెపి దానిని సుస్థిరం చేసుకోవడానికి రాజకీయ కుట్రలను పాల్పడుతుందన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లును ప్రజలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు,  కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్‌, బత్తుల లెనిన్‌, భూక్యా వీరభద్రం , జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకం: మైనార్టీ కాంగ్రెస్‌ పార్టీ

బిజెపి ప్రభుత్వం స్వలాభం కోసం పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టారని దీంతో కులమతాలు మధ్య చిచ్చు పెట్టడమేనని, కాంగ్రెస్‌ మైనార్టీ ఖమ్మం జిల్లా ఛైర్మన్‌ ఎండి తాజుద్దీన్‌ తెలిపారు. గురువారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పౌరసత్వ బిల్లుకు తాము వ్యతిరేకమని దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ బలంతో మెజార్టీ ఉండటం వల్ల బిల్లు పాస్‌ చేయించుకొని దేశ ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క పార్టీ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి పాషా, సయ్యద్‌ ఫరీద్‌ ఖాద్రి,ఎస్‌కె.బిక్కన్‌. అబ్దుల్‌ ఆహద్‌, ఎస్‌కె.అబ్బాస్‌, ఎస్‌కె.ఇస్మాయిల్‌, ఎస్‌కె.రజీ, సయ్యద్‌  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments