Wednesday, December 11, 2019

'దిశ'ఎన్‌కౌంటర్‌..ఆ మృతుల వయస్సుపై సందేహాలు..!?

ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

రాష్ట్రంలో చటాన్‌పల్లి ఎదురుకాల్పుల ఘటనలో ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత నిందితుల విషయమై అనేక సందేహాలు, సమాధానాలతో రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా మృతుల వయస్సుపై నెలకొన్న సందేహాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన నలుగురిలో ముగ్గురు మైనర్లున్నారనే అను మానాలుండటం..ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధృవీకరణ పత్రాలు పరస్పర విరుద్ధంగా ఉంటడం లాంటి కారణాలతో వారి వయస్సు నిర్థారణ ఎలా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సందర్భాల్లో వయస్సు నిర్థారణకు శాస్త్రీయ పద్ధతుల్ని అవలంభించడమే ప్రామాణికంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒస్సిఫికేషన్‌ టెస్ట్‌(అస్థీకరణ పరీక్ష)  ద్వారా వయస్సు నిర్థారణ చేయడం ఆనవాయితీ. ఎదురు కాల్పులకు ముందు అరెస్టు చేసిన సందర్భంలో సైబరాబాద్‌ పోలీసులు వారి వయస్సు 20 సంవత్సరాల కంటే ఎక్కు వుగా ఉన్నట్లు నమోదు చేశారు. నిందితుల చెప్పిన వివరాల ఆధారంగానే అలా చేశామనేది పోలీసుల వాదన. హత్యాచార ఘటనలో 'సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌' క్రమంలో నిందితులు ఎదురుతిరగడంతో ఎదురుకాల్పులు జరిగి ఆ నలుగురు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు.
          ఆధార్‌ పరంగా శివ, చెన్నకేశవులు, నవీన్‌ పుట్టిన సంవత్సరం 2001గా ఉంది. వీరిలో ఇద్దరికి సంబంధించిన బోన్‌ఫైడ్‌ సర్టిఫికెట్‌లో ఉన్న వారి పుట్టిన తేదీలను బట్టి మైనర్లుగా భావించాల్సి వస్తోంది. ఒకరి పుట్టినతేదీ 15.08.2002 గా.. మరొకరి పుట్టినతేదీ 10.04.2004 గా పత్రాల్లో నమోదైంది.తాజాగా మరో నిందితుడి కుటుంబ సభ్యులు తమ కుమారుడికి సంబంధించిన బోన్‌పైడ్‌ సర్టిఫికెట్‌ను మంగళవారం సేకరించారు. అందులో అతని పుట్టిన తేదీ 04.04.2004లో పుట్టినట్టుగా నమోదైంది. అంటే ఇతని వయస్సు 15 సంవత్సరాల 8 నెలలన్న మాట. 2004లో పుట్టిన వీరద్దరి మధ్య వయస్సు తేడా కేవలం ఆరు రోజులు మాత్రమే. దీన్ని బట్టి మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధ్రువపత్రాలను నిందితుల కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం'మీ కుమారులు మైనర్లయితే ధృవపత్రాలు ఇవ్వండి' అని సూచించింది. తాము సేకరించిన ధృవపత్రాలను ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చిన వాట్సాప్‌ నెంబర్‌కు నిందితుల కుటుంబ సభ్యులు పంపినట్లు సమాచారం..
నిర్థారణ ఎలా..?
వయస్సు నిర్థారణ తెలిపే ధృవీకరణపత్రాలేవీ అందుబాటులో లేనప్పుడు లేదా వైరుఢ్యంగా ఉన్నప్పుడు అస్థీకరణ పరీక్ష విధానాన్ని అవలంభిస్తుంటారు. ఎముకల ధృఢత్వాన్ని  పరీక్షించడం ద్వారా పోరెన్సిక్‌ వైద్య నిపుణులు వయస్సును అంచనా వేస్తారు. సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు దిగువ అవయవాల ఎముక వంటి ఎముక ధృఢంగా ఉంటుంది. దీన్ని మదించడం ద్వారా ఫోరెన్సిక్‌ నిపుణులు వయసు నిర్థారణపై అంచనాకు వస్తారు. అయితే ఈ అంచనా తేదీతో సహా కచ్చితంగా ఉండదు. అసలు వయసుకు కొంచెం అటూఇటుగా ఉంటుంది. అయినా కేసుల విచారణ క్రమంలో ఈ నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటారు. మరోవైపు కేసుల దర్యాప్తు క్రమంలో ఎవరిదైనా వయసు నిర్థారణ చేయాల్సి వచ్చినప్పుడు స్థానిక విచారణ పద్ధతుల్ని అవలంభిస్తుంటారు. 


No comments:

Post a Comment