Wednesday, December 4, 2019

కరుణగిరి 'జి+2' ఇళ్లపై కనికరం చూపండి...!

ఆందోళనలో నివాసితులు

రేపో..మాపో ప్రమాదం పొంచి ఉన్నదనే ఆందోళనతో ఆ పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉంటూ బ్రతుకు వెళ్లదీస్తున్న ఆ కుటుంబాల మధ్య ఏదైనా ప్రమాదం జరిగితే నష్టం తీవ్రత భారీగా ఉంటుంది. ఖమ్మం నగరానికి శివారు ప్రాంతమైన ఖమ్మం రూరల్‌ మండలంలో కరుణగిరిలో ఉన్న రాజీవ్‌ గృహకల్ప కాలనీ 50 సంవత్సరాల గ్యారంటీతో  జి+2 ఇళ్లు నిర్మించారు. ఆ భవనాలలో సుమారు 3 వేలకు పై చిలుకు పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆ భవనాలు పది సంవత్సరాలకే శిథిలావస్థకు చేరాయని  నివాసితులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భవనాలన్నీ నాని ఉన్నాయని, గోడలన్నీ పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎప్పటికైనా తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కూలి ప్రాణ నష్టం జరిగిన తర్వాత నష్ట పరిహారం ప్రకటించే బదులు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. సంబంధిత గృహ నిర్మాణ శాఖ ద్వారా మరమ్మతులైనా చేపించాలని వారు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి మరి..!

No comments:

Post a Comment