కిశోర ప్రాయంలో ఉన్న ఒక మగ పులి కొత్త ప్రాంతం, ఆడపులి సాహచర్యం కోసం ఏకంగా 1300 కిలోమీటర్లు ప్రయాణించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణలోని ఆరు జిల్లాల గుండా దీని ప్రయాణం సాగిందని చెప్పారు. చివరకు మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యాన్ని చేరిందన్నారు. టీబ్ల్యూఎల్‌ఎస్‌-టీ1-టీ1 అనే పులి యావత్మాల్‌ జిల్లాలోని తిపేశ్వర్‌ పులుల అభయారణ్యంలో 2016లో పుట్టింది. సీ2,సీ3 అనే రెండు మగ పులులు కూడా అదే తల్లికి పుట్టాయి. కిశోర ప్రాయంలో ఉండే పులులు తమకంటూ ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అందులో భాగంగా అనువైన చోటును గుర్తించేందుకు గాలింపు చేపడతాయి. ఆ తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది మార్చిలో అధికారులు సి1,సీ3 పులులకు రేడియో కాలర్లు అమర్చి, వాటి కదలికలను పరిశీలించారు. జూన్‌లో అవి తిపేశ్వర్‌ అభయారణ్యాన్ని వీడాయి. తొలుత అవి ప్రక్కనే ఉన్న పంధార్‌కవాడా డివిజన్‌కు, ఆ తర్వాత తెలంగాణకు చేరాయి. జూలై మధ్యలో సీ3 తెలంగాణకు వెళ్లింది. ఆదిలాబాద్‌ పట్టణం వరకు వెళ్లింది. అయితే అక్కడ స్థిర పడటానికి బదులు పది రోజుల్లోనే తిరిగి తిపేశ్వర్‌ అభయారణ్యానికి వచ్చింది. సి1..అంబాడి ఘాట్‌, కిన్వాత్‌ అడవుల గుండా ఆదిలాబాద్‌ డివిజన్‌కు చేరింది. ఆగష్టు నుంచి సెప్టెంబర్‌ వరకు ఆదిలాబాద్‌, నాందేడ్‌ డివిజన్లలోని అంతరాష్ట్ర అడవుల్లో చాలా రోజులు గడిపింది. డిసెంబర్‌ 1న ధ్యానగంగ అభయారణ్యాన్ని చేరింది. ఈ క్రమంలో అది 150 రోజుల్లో రెండు రాష్ట్రాల్లోని ఆరు జిల్లాల్లో వందలాది గ్రామాలు, పొలాల గుండా పయనించింది. ఎన్నడూ మానవులతో ఘర్షణకు దిగలేదు. అయితే ఆకలి తీర్చుకోవడానికి పశువులను చంపింది.

Post a Comment

Previous Post Next Post