''కార్మికులారా..! మీ పోరాటం స్ఫూర్తిదాయకం''

49 రోజులుగా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్‌టీసీ కార్మికుల దయనీయ పరిస్థితిపై  సిపిఎస్‌ ఉద్యోగుల సంఘం తమ ఔదార్యాన్ని చాటుకుంది. ''కార్మికులారా..మీ పోరాటం స్ఫూర్తి దాయకం..మీ త్యాగాలు భవిష్యత్‌ తరాలకు వినిపించే సుదీర్ఘ పోరాట గళంగా..వినిపించనుంది..'' అంటూ వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. శుక్రవారం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సిపిఎస్‌) ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేతనాలు రాక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న 15 మంది ఆర్‌టిసి కార్మికులకు బియ్యం, పప్పు, నూనెలు, పంచదారలతో కలిపి రూ.1,500 విలువ గల నిత్యవసర కిట్‌లను సమ్మె శిబిరం వద్ద కార్మికులకు అందజేశారు. ఖమ్మం డిపో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వితరణ కార్యక్రమంలో సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రకంటి శశిధర్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు కోసం పోరాడుతున్న మాకు ఆర్‌టిసి కార్మికుల సమ్మె స్ఫూర్తిని కలిగించిందన్నారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మె జయప్రదం కావాలని ప్రభుత్వం సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. కార్మికులకు ఆర్థికంగా, పోరాటం పరంగా  ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల కరుణాకర్‌ , జిల్లా బాధ్యులు బెజ్జంకి ప్రభాకారా చారి, ఆర్‌టిసి ఐకాస రీజనల్‌ కన్వీనర్‌ కీసర శ్రీనివాసరెడ్డి, డిపో ఐకాస నాయకులు కొమ్ము వినోదరావు, గుడిబోయిన శ్రీనివాస్‌, గుండు మాధవరావు, సుల్తానా, కల్పన, గంజి కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments