Tuesday, November 12, 2019

ఆ డ్రైవర్‌ పరిస్థితి విషమం..!

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో క్యాబిన్‌లో చిక్కుకున్న ఎంఎంటిఎస్‌ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని కేర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.సుష్మ వెల్లడించారు. ఈమేరకు ప్రమాదంలో గాయపడి, ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని ప్రక్కటెముకలు, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని ఆమె వివరించారు.అతడితో పాటు ప్రమాదంలో గాయపడిన శేఖర్‌, బేలేశ్వరమ్మ, రాజ్‌కుమార్‌, సాజిద్‌, మహ్మద్‌ ఇబ్రహీంకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటిఎస్‌ రైలు సికింద్రాబాద్‌కు వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం 10.42 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలపాలయ్యారు. హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాన లైను నుంచి లూపు లైను ద్వారా 4వ ప్లాట్‌ఫాం వైపు వస్తుండగా ఎంఎంటిఎస్‌ రైలు కాచిగూడ నుంచి ఫలక్‌నుమా వెళ్తూ వేగంగా ఢీకొట్టింది. ఈ దాటికి ఎంఎంటీఎస్‌ నుండి ఆరు బోగీలు గాల్లో లేచి పట్టాలు తప్పాయి.

లోకో పైలట్‌పై కేసు నమోదు..

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి కారణమైన ఎంఎంటీఎస్‌ లోకో ఫైలట్‌ చంద్రశేఖర్‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాచిగూడ స్టేషన్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్‌ ప్రస్తుతం నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకున్నాక అతని నుంచి వాంగ్మూలం తీసుకోవాలని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment