Monday, November 25, 2019

మన పోరాటం న్యాయమైనది..లాఠీలతో ఆపలేరు

నేడు డిపోల ఎదుట ఆందోళనలు: అశ్వత్థామరెడ్డి
ఆర్‌టిసి కార్మికులు ఎవరికీ భయపడవద్దు..మన పోరాటం న్యాయమైనది..లాఠీలు, తూటాలతో ఉద్యమాన్ని అణిచి వేయలేరు..''అని ఆర్‌టిసి జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం నగరంలోని ఎంజీబీఎస్‌లో జేఏసీ నేతలు రాజిరెడ్డి, రాజలింగం, వీఎస్‌కె రెడ్డి, ఎల్బీరెడ్డి, ఎస్‌ఏరాజు, సుధతో కలిసి సమావేశం నిర్వహించారు. భవష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ కార్మికులందరూ ఐక్యంగా సమ్మెలో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం..మానవతా ధృక్పథంతో ఆలోచించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన ఆర్‌టిసి కార్మికులతో ఈ విధంగా వ్యవహరించడం తగదని గుర్తు చేశారు. సంస్థను పరిరక్షించుకునేందుకు కార్మికులు త్యాగాలకు సిద్ధమేనని ప్రకటించారు. మొత్తంగా 51 రోజులు పూర్తి చేసుకొని సమ్మె కొనసాగుతూనే ఉంది.
మహిళా ఉద్యోగుల నిరసన..
హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో ఆదివారం 29 డిపోలకు చెందిన ఆర్‌టిసి మహిళా ఉద్యోగులు మౌన దీక్ష, నిరసనలు, మానవహారం నిర్వహించారు. బస్టాండులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. తొలుత ఆచార్య జయశంకర్‌ ఆర్‌టీసీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. 
నేడు డిపోల ఎదుట ఆందోళనలు..
రాష్ట్రంలో అన్ని ఆర్‌టిసి డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలకు దిగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాడాలని సూచించారు. 'ఆర్‌టిసిని రక్షించండి' అంటూ సోమవారం భారీగా నిరసనలు చేయాలని కోరారు.సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment